MeeSeva App in Telangana :ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఇటీవల ప్రభుత్వం కొత్తగా మీ-సేవ కనెక్ట్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మీ -సేవ యాప్ ఇదివరకు టీ-ఫోలియోగా ఉండేది. ఈ పేరును మార్చి మీ-సేవ యాప్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. దీనిని సెల్‌ఫోన్‌లో ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని ధ్రువపత్రాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
మీ-సేవ యాప్‌లో 300 పౌర సేవలు : 2011లో ఉమ్మడి ఏపీలో అప్పటి ప్రభుత్వం మీ-సేవ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ధ్రువపత్రాల కోసం దళారుల ప్రమేయం లేకుండా అధికారుల పర్యవేక్షణలో వీటిని చేస్తున్నారు. ప్రతి సేవకు కొంత రుసుము నిర్ణయించి నిర్వహణ చేశారు. ఈ రుసుమే నిర్వాహకులకు కమీషన్ రూపంలో చెల్లిస్తున్నారు. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సుమారు 300లకు పైగా పౌర సేవలు పొందే వెసులుబాటును ఇందులో కల్పించారు.
ఇదివరకు పహానీలు, 1బీలను ఈ మీ-సేవ కేంద్రాల నుంచే పొందేవారు. కానీ ధరణి అమల్లోకి వచ్చిన తర్వాత వీటి సేవలు నిలిచిపోయాయి. దీంతో మీ-సేవల్లో గిరాకీ తగ్గిందని నిర్వాహకులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం తాజాగా మరో తొమ్మిది సేవలను అమల్లోకి తీసుకువచ్చింది. వీటిద్వారా ప్రజలకు మరింత సమాచారాన్ని, ప్రభుత్వ సేవలను చేరవేయనున్నారు.
గ్రామీణులకు ప్రయోజనం : ఇప్పుడు మండలానికో మీ-సేవ కేంద్రం ఉండగా, డిమాండ్ ఉన్న చోట్ల మాత్రం ప్రభుత్వ అనుమతులతో రెండు, మూడింటిని ఏర్పాటు చేశారు. దీంతో మారుమూల గ్రామాల ప్రజలు ఏదైనా ధ్రువపత్రాలు కావాలంటే మండల కేంద్రాలు, పట్టణాలకు రావాల్సిన అవసరం ఉంటుంది. దీంతో వారికి రవాణా ఖర్చులతో పాటు సమయం వృథా అవ్వడమే కాకుండా శారీరకంగా అలిసిపోతున్నారు. ప్రస్తుతం యాప్ ద్వారానే సేవలు పొందే అవకాశం ఉంది. ఇది గ్రామీణీలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.