Double Bedroom Houses for Displaced Persons in Musi Project :మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు నిర్వాసితులకు డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో 16,002 ఇళ్లను కేటాయిస్తూ జీవో ఇచ్చింది. మూసీ రివర్ బెడ్, బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలను తొలగించి, నిర్వాసితులకు పునరావాసం కింద వీటిని ఇవ్వనున్నారు. ఇప్పటికే నిర్వహించిన సర్వే ప్రకారం 10,200 మంది నిర్వాసితులు కానున్నట్లు అధికారులు గుర్తించారు. ముందుగా మూసీ రివర్ బెడ్లో ఉన్న 1600 నిర్మాణాలను తొలగించి అక్కడ ఉన్న వారిని తరలిస్తారు.
మూసీ బఫర్ జోన్లో నివసిస్తున్న వారికి భూసేకరణ, పునరావాస చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిర్మాణ ఖర్చులతో పాటు పట్టా ఉంటే భూమి విలువను చెల్లించడంతో పాటు డబుల్ బెడ్ రూం ఇంటిని ఇవ్వనున్నారు. నిర్వాసితులను సంప్రదించి పునరావాసం కల్పించే ప్రక్రియను కలెక్టర్లు బుధవారం ప్రారంభించనున్నారు. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో అధికారుల బృందాలు బుధవారం ఇంటింటికి వెళ్లి అక్కడున్న ప్రజలకు, ఎక్కడెక్కడ డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయించారో వివరిస్తారు.
చెరువుల వద్ద సీసీ కెమెరాలు : చెరువులు, నాలాల ఆక్రమణల పరిధిలో ఉన్న పేదల వివరాలు కూడా సేకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు లేదా ఇతర ప్రత్యామ్నాయం చూపి వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. అవుటర్ రింగు రోడ్డు వరకు చెరువుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలన్న సీఎం, కబ్జా కాకుండా పర్యవేక్షించేందుకు చెరువుల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.