Telangana Govt Release Crop Loss Money :తెలంగాణలో భారీ వర్షాల వల్ల జరిగిన పంట నష్టానికి పరిహారం నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రంలో 28 జిల్లాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు నిర్ధారించారు. 79,574 ఎకరాల పంట నష్టానికి రూ.79.57 కోట్లును విడుదల చేసింది. ఈ క్రమంలో 79,216 మంది రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ అయ్యేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.
ఈ ఏడాది వానా కాలం ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 6వ తేదీ వరకు కురిసిన భారీ వర్షాలు, వరదల ప్రభావంతో సంభవించిన పంట నష్టానికి పరిహారం నిధులు విడుదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాల్లో 79,574 ఎకరాల విస్తీర్ణంలో పంటల నష్టం సంబవించినట్లు వ్యవసాయ శాఖ అధికారులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో రైతుల విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు కేవలం నెల రోజుల వ్యవధిలోనే పంట నష్టపోయిన 79,216 మంది రైతులకు పరిహారం కింద రూ.79.57 కోట్ల నిధులు విడుదల అయ్యాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.
అత్యధిక పంట నష్టం ఖమ్మంలోనే : అత్యధికంగా పంట నష్టం ఖమ్మం జిల్లాలో 28,407 ఎకరాల విస్తీర్ణం మేర సంభవించింది. తరువాత స్థానంలో మహబూబాబాద్ జిల్లాలో 14,669 ఎకరాలు, సూర్యాపేట జిల్లాలో 9,828 ఎకరాల్లో పంటల నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. మిగతా 22 జిల్లాలకు సంబంధించి అత్యల్పంగా 19 ఎకరాల నుంచి 3,288 ఎకరాల విస్తీర్ణం వరకు పంట నష్టం జరిగినట్లు వ్యవసాయశాఖ అధికారులు నిర్ధారించారు. పంట నష్ట పరిహారం ఎకరానికి రూ.10 వేలు చొప్పున నేరుగా రైతు ఖాతాల్లోనే జమ అయ్యేలా అధికారులు ఏర్పాటు చేసినట్లు మంత్రి తుమ్మల తెలియజేశారు.