తెలంగాణ

telangana

ETV Bharat / state

వాహనదారులకు బ్యాడ్​ న్యూస్​ - రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలకు రోడ్ ట్యాక్స్‌ పెంపు? - ROAD TAX PRICES IN TELANGANA

రోడ్‌ ట్యాక్స్‌ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం - పొరుగు రాష్ట్రాల్లో అధికారుల అధ్యయనం - త్వరలో మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిక

TELANGANA GOVT ON NEW ROAD TAX PRICES
Telangana Govt on Road Tax Prices (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 25, 2024, 9:18 AM IST

Telangana Govt on Road Tax Prices :పెట్రోల్, డీజిల్‌తో నడిచే కొత్త వాహనాలకు విధించే రోడ్‌ ట్యాక్స్‌ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు తెలిసింది. ఇతర రాష్ట్రాల్లో వాహనాలపై వస్తున్న ఆదాయం, రిజిస్ట్రేషన్‌ విధానం తదితర అంశాలపై కొద్దిరోజుల క్రితం రాష్ట్ర రవాణాశాఖ అధికారులు అధ్యయనం చేశారు. రాష్ట్రంలో వాహనాలతో వచ్చే ఆదాయం, పన్నుల శ్లాబుల్ని, ఇతర రాష్ట్రాల్లో రోడ్‌ ట్యాక్స్‌ గణాంకాల్ని బేరీజు వేశారు. ఈ వివరాలతో అధికారులు ఓ నివేదిక రూపొందించగా తర్వలో దీన్ని మంత్రివర్గ ఉప సంఘానికి సమర్పించనున్నట్లు సమాచారం. ఈ మేరక మంత్రివర్గ ఉపసంఘం చర్చించి రోడ్‌ ట్యాక్స్‌పై ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.

పెట్రోల్, డీజిల్‌తో నడిచే కొత్త వాహనాలకు సంబంధించి బైక్​లకు 2, ఫోర్​ వీలర్లకు 4 రకాల రోడ్​ ట్యాక్స్​ శ్లాబులున్నాయి. ఈ సంఖ్యను కుదించాలన్న ఆలోచనలో రాష్ట్ర రవాణాశాఖ ఉన్నట్లు సమాచారం. వాహన రిజిస్ట్రేషన్‌లో కీలకమైన రోడ్​ ట్యాక్స్​ను కూడా కొంతమేర పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో లక్ష రూపాయలపైనే విలువున్న ద్విచక్రవాహనాలు, పది లక్షల రూపాయలపైన ఉన్న కార్లకు రోడ్డు ట్యాక్స్​ పెరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

కేరళ, తమిళనాడుల్లో అధికంగా ట్యాక్స్​

కొన్ని రాష్ట్రాల్లో రోడ్డు ట్యాక్స్​ ఎక్కువగా ఉండటం వల్లే ఆ రాష్ట్రాలకు రవాణా ఆదాయం అధికంగా వస్తుందని అధికారులు గుర్తించారు. ముఖ్యంగా కేరళ, తమిళనాడుల్లో ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. కేరళలో రోడ్డు ట్యాక్స్​ 21% ఉండగా తమిళనాడులో 20 శాతంగా ఉంది.

  • రాష్ట్రంలో వాహనం రకం, ధర ఆధారంగా 12-14-18 శాతాలతో మూడు రకాలుగా రోడ్​ ట్యాక్స్ శ్లాబులుండేవి. 2022లో రోడ్​ ట్యాక్స్​ను పెంచుతూ కొన్ని మార్పులు చేశారు. రాష్ట్రంలో పలు వాహనాలకు రోడ్​ ట్యాక్స్​ పెరిగే అవకాశం ఉన్నా పొరుగు రాష్ట్రాల్లో ఉన్న పన్ను కంటే దాటకపోవచ్చని రవాణాశాఖలో కీలక బాధ్యుడొకరు తెలిపారు. ఈ విషయమై నిర్ణయం తీసుకోవడానికి కొంతమేర సమయం పడుతుందని చెప్పారు.
  • రాష్ట్ర రవాణాశాఖ ఆదాయంలో 65 -70 శాతం రోడ్​ ట్యాక్స్​ ఉంటుంది. 2021-22లో రూ.3,971.39 కోట్ల ఆదాయం వచ్చింది. 2022లో రోడ్​ ట్యాక్స్​ పెంచడంతో 2022-23లో ఏకంగా రూ. రూ.6,390.80 కోట్ల ఆదాయం వచ్చింది. 2023-24లో రూ. రూ.6,990.29 కోట్ల ఆదాయం సమాకూరింది. ఈ నేపథ్యంలో తాజాగా రోడ్​ ట్యాక్స్​ పెంచితే అదనంగా రూ.2 వేల కోట్లుపైగా ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేశారు.
  • రిజిస్ట్రేషన్‌ సమయంలోనే వ్యక్తిగత వాహనాలకు సంబంధించి రోడ్‌ ట్యాక్స్‌గా రవాణాశాఖకు ఆదాయం వస్తుంది. 15 ఏళ్లపాటు తిరిగేందుకు ఒకేసారి పన్ను కట్టించుకుని అనుమతి ఇస్తారు.15 ఏళ్లకు ఒకేసారి కాకుండా రవాణా వాహనాలకు త్రైమాసికానికి ఓసారి చెల్లించే వెసులుబాటు ఉంటుంది.
  • ప్రస్తుతం రాష్ట్రంలో కార్లకు సంబంధించి వాహన ధర రూ.5 లక్షల లోపు ఉంటే 13%, రూ.5-10 లక్షల మధ్య అయితే 14%, రూ.10-20 లక్షల మధ్య 17%, రూ.20 లక్షలు ఆపైన 18% పన్ను శ్లాబులున్నాయి. ఏపీలో​, కర్ణాటకలో ఇదేవిధంగా శ్లాబులుండగా తమిళనాడులో 12 నుంచి 20 శాతం, కేరళలో 9 నుంచి 21 శాతం ఆయా శ్లాబులున్నాయి.
  • రాష్ట్రంలో రూ.50 వేల లోపు ద్విచక్ర వాహనాలకు 9%, ఆపై విలువ ఉంటే 12 % రోడ్ ట్యాక్స్​ శ్లాబులున్నాయి. కర్ణాటకలో లక్ష రూపాయలపైన వాహనాలకు 18%, కేరళలో 2 లక్షల రూపాయలపైనే విలువైన ద్విచక్రవాహనాలకు 21 శాతం పన్ను విధిస్తున్నారు.

రాష్ట్రాల వారీగా ఆదాయం

తెలంగాణలో రోడ్‌ ట్యాక్స్, రవాణా ఆదాయం, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ద్వారా వచ్చే ఆదాయం లెక్కలను పొరుగు రాష్ట్రాల్లో రవాణా ఆదాయం, అక్కడ అనుసరిస్తున్న విధానాలను రాష్ట్ర అధికారులు పోల్చి ఓ స్టేట్​మెంట్​ను రూపొందించారు. 2023-24లో ఆయా రాష్ట్రాల్లో వచ్చిన ఆదాయం వివరాలివి.

ఆయా రాష్ట్రాల్లో వచ్చిన ఆదాయం (ETV Bharat)

రాజధానికి వచ్చే ఆ వాహనాలకు టోల్​ ఫ్రీ - మహారాష్ట్ర సీఎం గుడ్​న్యూస్

ABOUT THE AUTHOR

...view details