Fourth City Development In Hyderabad :తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించతలపెట్టిన నాలుగో నగరం పరిధి మరింత పెరగనుంది. ఇబ్రహీంపట్నం, కందుకూరు, మహేశ్వరం, కడ్తాల్, అమన్‌గల్ మండలాల్లోని 45 గ్రామాలను దాని పరిధిలో చేర్చాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఆ మండలాలను ఫ్యూచర్‌సిటీలో విలీనం చేయాలా? యధాతథంగా పురపాలక, మండలాల పరిధుల్లోనే కొనసాగించాలా? అనే అంశాలకు సంబంధించి రెవెన్యూ అధికారులు వివరాలు సేకరించారు. ఇప్పటికే కందుకూరు మండలం పరిధిలోని 18 గ్రామాలు నాలుగో నగరంలో ఉన్నాయి. మరో 27 గ్రామాలనూ కలపాలని అధికారులు ప్రతిపాదనలను పంపారు.
మౌలిక వసతులపై దృష్టి :నాలుగో నగరం పరిధి తొలుత 14 వేల ఎకరాలే ఉండగా అధికారులు 1.50 లక్షల ఎకరాలకు ప్రతిపాదించారు. శంషాబాద్, పెద్దఅంబర్‌పేట్, ఇబ్రహీంపట్నంకు వేగంగా వెళ్లేలా రహదారులను నిర్మించనున్నారు. కొంగరకలాన్ నుంచి ఆకుతోటపల్లి వరకూ 4 వేల కోట్ల రూపాయలతో 44 కిలోమీటర్ల గ్రీన్‌ఫీల్డ్ రహదారిని ప్రతిపాదించారు. వీటికి అనుసంధానంగా పరిశ్రమలు, ఇతర సంస్థలకు రహదారుల సౌకర్యం కల్పించనున్నారు.