'ఒకే రాష్ట్రం-ఒకే పోలీస్' విధానం అమలు చేయాలనే డిమాండ్‌తో తెలంగాణ పోలీస్ బెటాలియన్ సిబ్బంది(తెలంగాణ స్పెషల్ పోలీస్) చేస్తున్న ఆందోళనతో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వారు చూస్తున్న సచివాలయం భద్రతను మళ్లీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ - ఎస్పీఎఫ్కు అప్పగిస్తూ ఆదేశాలు జారీచేసింది.
కొత్త సచివాలయం ప్రారంభం నుంచి తెలంగాణ స్పెషల్ పోలీస్ భద్రత విధులు నిర్వహించింది. సుమారు 600 మంది సిబ్బంది రోజువారి విధుల్లో ఉండేవారు. అంతకుముందు 25 ఏళ్లుగా ఎస్పీఎఫ్ సెక్రటేరియెట్ భద్రతను చూసుకునేది. కేసీఆర్ సర్కార్ కొత్త సచివాలయం నిర్మాణం తరువాత ఆ బాధ్యతలు తెలంగాణ స్పెషల్ పోలీస్‌కు అప్పగించారు. ఇప్పుడు మళ్లీ రేవంత్ సర్కార్ ఎస్పీఎఫ్(SPF)కు అప్పగిస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.
అసలేం జరిగింది :సెలవుల విషయంలో పోలీస్ శాఖ కొత్తగా జారీ చేసిన ఉత్తర్వులు రద్దు చేయాలంటూ గత వారం రోజులుగా తెలంగాణ స్పెషల్ పోలీసులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. వీటిపై డీజీపీ కూడా స్పందించారు. సెలవుల విషయంలో పాత విధానాన్ని అనుసరిస్తామని ప్రకటించారు. అయినా కూడా వారి ఆందోళనలు ఆగలేదు. 'ఒకే పోలీస్ - ఒకే రాష్ట్రం' పేరుతో తమకు సాధారణ పోలీసుల తరహాలో డ్యూటీలు వేయాలని, సెలవులు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు.