తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్‌లో మరో జూపార్క్- రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి ప్రణాళిక - Zoo Park in Fourth City

Zoo Park in Fourth City : రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ నగరం అవతల ముచ్చర్ల ప్రాంతంలో రాబోయే ‘ఫోర్త్‌ సిటీ’లో జూపార్కు ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. ఫోర్త్‌ సిటీలో అధికంగా 15 వేల ఎకరాలకు పైగా రెవెన్యూ భూమి ఉండటంతో అక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జూపార్కుతో పాటు నైట్‌ సఫారీ వంటివి సైతం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు.

Eco Tourism in Telangana
Zoo Park in Fourth City (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 20, 2024, 9:11 AM IST

Telangana Eco Tourism Development :హైదరాబాద్‌ నగరంలో చూడాల్సిన ప్రాంతాల్లో నెహ్రూ జూపార్క్ ఒకటి. ఇక్కడికి పెద్దఎత్తున పర్యాటకులు వస్తుంటారు. త్వరలో భాగ్యనగరం సిగలో మరో కలికితురాయి చేరబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్మించబోయే ఫోర్త్‌సిటీలో జూపార్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వైల్డ్ లైఫ్ పర్యాటక ప్రదేశాల గురించి అధికారులు ఆరా తీస్తున్నారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో అంబానీ కుటుంబం 3 వేల ఎకరాల్లో ‘వన్‌తారా’ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంపై అధ్యయన ప్రక్రియను ప్రారంభించినట్లు సమాచారం.

రెవెన్యూ భూముల్లోనే : భాగ్యనగరం చుట్టూ హెచ్‌ఎండీఏ పరిధిలో అనేక అటవీ బ్లాకులు ఉన్నాయి. వీటి పరిధిలో లక్షన్నర ఎకరాల మేర అటవీ భూమి ఉంది. దేశంలో ఏ నగరానికి ఇంత విస్తీర్ణంలో అటవీ ప్రాంతం లేదు. ప్రకృతి పర్యాటకానికి హైదరాబాద్‌ ఎంతో అనుకూలంగా ఉంది. అయితే జూపార్కులను రక్షిత అటవీ ప్రదేశాల్లో ఏర్పాటు చేయడానికి అనుమతి లేదు. రెవెన్యూ భూముల్లోనే ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ‘ఫోర్త్‌ సిటీ’ ప్రాంతంలో జూపార్కు ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

200 ఎకరాల్లో : ప్రభుత్వ ప్రతిపాదిత ఫోర్త్‌ సిటీ చుట్టుపక్కల సుమారు 18 వేల ఎకరాల అటవీ ప్రాంతం ఉంది. తాడిపర్తి, మద్విన్, కురుమిద్ద, కడ్తాల్, నాగిలి అటవీ బ్లాకుల పరిధిలో 15-16 వేల ఎకరాల అటవీ భూమి ఉంది. గుమ్మడవెల్లి అటవీ బ్లాక్‌లో మరో 2000 ఎకరాల రిజర్వ్ అడవి ఉంది. ఈ అటవీ బ్లాకులకు ఆనుకుని ఉండే రెవెన్యూ భూమిలో జూపార్కు ఏర్పాటుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఫోర్త్‌ సిటీలో 200 ఎకరాల్లో జూపార్కు ఏర్పాటుచేసి, దానికి అనుబంధంగా వెయ్యి ఎకరాల అటవీ ప్రాంతాన్ని గ్రీన్‌ బెల్టుగా చూపాలని భావిస్తోంది. జూపార్కుతో నైట్‌ సఫారీ వంటి ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నట్లు అటవీశాఖ వర్గాల ద్వారా తెలుస్తోంది.

ఎకో టూరిజం అభివృద్ధికి యోచన : ఫోర్త్‌ సిటీలోని ఓ ప్రాంతంలో లోయలు, గుట్టలు పెద్దఎత్తున చెట్లున్నాయి. రెవెన్యూ భూమి అయినప్పటికీ అటవీ ప్రాంతంలా ఉంటుంది. జూపార్కు, నైట్‌ సఫారీ వంటివి ఏర్పాటు చేసి ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ ప్రాజెక్టుకు అవసరమయ్యే నిధులు, నిర్వహణను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ)లో ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో గుజరాత్ ‘వన్‌తారా’ ప్రాజెక్టును ఏర్పాటు చేసిన రిలయన్స్‌తో పాటు పలు ప్రైవేటు సంస్థలతో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

నేడు రాష్ట్ర మంత్రివర్గ భేటీ- అజెండాలోని కీలక అంశాలివే! - Telangana Cabinet Meet Today

దేశానికే రోల్​మోడల్​గా స్కిల్ యూనివర్సిటీ - 150 ఎకరాల స్థలం రూ.100 కోట్లు కేటాయింపు : సీఎం - CM Revanth On Skill University

ABOUT THE AUTHOR

...view details