Telangana Government Committee on VRA Issues : తెలంగాణలో గ్రామ స్థాయిలో రెవెన్యూ విభాగాన్ని పటిష్ఠం చేసేందుకు గ్రామ రెవెన్యూ సహాయకుల వ్యవస్థను పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. గత సర్కార్ వీఆర్‌ఏ వ్యవస్థను రద్దు చేసి, ఇతర శాఖల్లో సర్దుబాటు చేసిన విషయం తెలిసిందే. చట్ట పరిమితులు, న్యాయ వివాదాలు, ఇతర విభాగాల్లో చేరిన వీఆర్‌ఏల సర్వీసుల పునరుద్ధరణ, తదితర సమస్యలపై అధ్యయనం చేయడానికి తాజాగా ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని శనివారం ఏర్పాటు చేసింది.
Five Members Committee on VRA Issues : ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ ఉత్తర్వులు ఇచ్చారు. భూ పరిపాలన ప్రధాన కమిషనర్ విభాగం కార్యదర్శి మెంబర్ కన్వీనర్‌గా రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లను సభ్యులుగా నియమించారు. వీఆర్ఏలకు సంబంధించిన వివిధ అంశాలను పరిశీలించి, వీలైనంత త్వరగా సిఫార్సులు ఇవ్వాలని ఆయన తెలిపారు. వీఆర్ఏ వ్యవస్థ పునరుద్ధరణ, చట్ట పరిమితి, ఇతర విభాగాల్లో సర్వీసుల పునరుద్ధరణ, న్యాయ వివాదాలు తదితర అంశాలను ఈ కమిటీ పరిశీలించనుంది.
ధరణి అవకవతవకలపై కమిటీ - పోర్టల్ పునర్నిర్మాణ బాధ్యతల అప్పగింత
అసంపూర్తిగా సర్దుబాటు పోస్టింగ్‌లు : గత బీఆర్ఎస్ ప్రభుత్వం వీఆర్‌ఏ వ్యవస్థను (VRA System in Telangana) రద్దు చేసి, 20,555 మంది వీఆర్‌ఏలలో 16,758 మంది ఉద్యోగాలను క్రమబద్ధీకరించింది. 14,954 మందిని వివిధ శాఖల్లో సర్దుబాటు చేస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తమకు పదోన్నతుల్లో నష్టం జరుగుతుందని పలువురు ఆఫీస్ సబార్డినేట్లు హైకోర్టును ఆశ్రయించగా, స్టేటస్ కో ఉత్తర్వులు వెలువడ్డాయి. హైకోర్టు ఉత్తర్వులు వెలువడేలోగా వివిధ శాఖల్లో 80 శాతం మంది విధుల్లో చేరారు. తమ సమస్యలపై వీఆర్ఏలు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేయడంతో తాజాగా కమిటీని నియమించింది.