Caste Census survey In Telangana : తెలంగాణలో నవంబర్ 6 నుంచి కులగణన ప్రక్రియను ప్రారంభించనున్నారు. దేశంలో తొలిసారిగా ఇక్కడ కులగణన చేపట్టనున్నారు. ఆరోజే అగ్రనేత రాహుల్ గాంధీని ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్యం యోచిస్తోంది. ఈమేరకు గాంధీ భవన్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. కులగణన తర్వాత ఏయే సంక్షేమ కార్యక్రమాలకు ఎంత నిధులు కేటాయించాలో తెలిసే అవకాశం ఉంది.
త్వరలో దీనిపై అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని మంత్రులు తెలిపారు. త్వరలో అన్ని జిల్లాల్లో కులగణనపై సమావేశాలు ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన వారిని ఆదుకోవడానికి ఈ సర్వే ఉపయోగపడుతుందని చెప్పారు. రాహుల్ గాంధీ హామీ మేరకు కులగణన చేస్తున్నామన్నారు. సర్వేతో అందరి సామాజిక, ఆర్థిక పరిస్థితులు తెలుస్తాయని పేర్కొన్నారు. భవిష్యత్‌లో దేశమంతా తెలంగాణను అనుసరిస్తుందని భట్టి విక్రమార్క తెలిపారు.