తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎల్​ఆర్​ఎస్​ లబ్ధిదారులకు బంపర్​ ఆఫర్ - ఆ తేదీలోపు రిజిస్ట్రేషన్​ చేసుకుంటే 25 రాయితీ - 25 PERCENT REBATE IN LRS FEE

ఎల్‌ఆర్‌ఎస్‌పై భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, శ్రీధర్‌బాబు సమీక్ష - మార్చి 31 వరకు ఎల్​ఆర్ఎస్​ ఫీజు చెల్లిస్తే 25 శాతం రాయితీ - సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోనే ఫీజు చెల్లించవచ్చని వెల్లడి

25 Percent Rebate IN LRS Fee
25 Percent Rebate IN LRS Fee (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 20, 2025, 7:15 AM IST

25 Percent Rebate IN LRS Fee :లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం(ఎల్​ఆర్​ఎస్​) అమల్లో భాగంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగేళ్లుగా పెండింగ్​లో ఉన్న ప్లాట్లకు రిజిస్ట్రేషన్​ చేసుకునే వీలు కల్పించింది. ఎల్​ఆర్ఎస్ ఫీజులోనూ 25శాతం రాయితీ ఇవ్వనుంది. ఎల్​ఆర్​ఎస్​పై మంత్రులు పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి, శ్రీధర్​ బాబు, సీఎస్​ శాంతికుమారిలతో కలిసి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమీక్షించారు.

ఎల్​ఆర్​ఎస్​ పథకం అమలును వేగవంతం చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. పెండింగ్​ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని సూచించారు. ఎల్​ఆర్​ఎస్​కు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోనే నేరుగా క్రమబద్ధీకరణ ఫీజును చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని సూచించింది. మార్చి 31లోగా రిజిస్ట్రేషన్లను పూర్తి చేసుకున్న వారికి ఎల్​ఆర్ఎస్​ ఫీజులో రాయితీ వర్తిస్తుందని తెలిపింది. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రులు సూచించారు.

ఆ తేదీలోగా ఎల్​ఆర్​ఎస్​ చెల్లిస్తే రాయితీ : అనుమతిలేని లే అవుట్లలోని ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై గతంలో ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో వాటిని కొనుగోలు చేసినవారికి నాలుగేళ్లుగా రిజిస్ట్రేషన్‌కి అవకాశం లేకుండాపోయింది. వారందరికీ ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తూ ప్లాట్లకి రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు అవకాశమిచ్చింది. వ్యక్తిగతంగా ప్లాట్లుకొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ పెండింగ్‌లో ఉన్నవారితోపాటు లే అవుట్లలో విక్రయం కాకుండా పెద్దసంఖ్యలో మిగిలిన స్థలాలకి క్రమబద్ధీకరణ పథకం అమలయ్యేలా వెసులుబాటు కల్పించింది. ఉదాహరణకు లేఅవుట్‌లో 10 శాతం ప్లాట్లు రిజిస్టర్‌అయి మిగిలిన 90 శాతానికి రిజిస్టర్‌ కాకుంటే ఎల్​ఆర్ఎస్ కింద వాటి క్రమబద్ధీకరణతోపాటు రిజిస్ట్రేషన్‌కి అవకాశం కల్పిస్తారు. ఇప్పటికే ప్లాట్లు కొనుగోలు చేసి, విక్రయ దస్తావేజు కలిగిన వారంతా మార్చి 31లోగా స్పందిస్తే రుసుంలో రాయితీ లభిస్తుందని పేర్కొన్నారు.

ప్రజా ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని :పేదలు నాలుగేళ్లుగా ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారని మంత్రులు తెలిపారు. ప్రజల ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రులు సూచించారు. ఎల్​ఆర్ఎస్ అమలులో పలు వెసులుబాట్లు కల్పిస్తున్నందున నిషేధిత జాబితాలోని భూముల్లోని ప్లాట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల వద్దనే సొమ్ము చెల్లించి రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రులు సూచించారు.

LRS లబ్ధిదారులకు గుడ్​న్యూస్ - పెండింగ్​లో ఉన్న దరఖాస్తులన్నింటికీ వన్​టైమ్​ సెటిల్​మెంట్​!

నత్తనడకన సాగుతున్న భూమి క్రమబద్ధీకరణ ప్రక్రియ - గడువులోగా పూర్తికావడం కష్టమే! - Telangana Govt Delay In LRS Work

ABOUT THE AUTHOR

...view details