Excise Actions on Illegal Liquor Supply in Telangana :రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడినవారిపై 13వేల564 కేసులు నమోదు చేసిన ఆబ్కారీ శాఖ 6,443 మందిని అరెస్టు చేసింది. భారీ ఎత్తున అక్రమ మద్యం, మత్తు పదార్ధాలు, గుడుంబా, కల్తీకల్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆబ్కారీ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని 146 ఆబ్కారీ పోలీస్‌స్టేషన్ల పరిధిలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసిన ఆబ్కారీ శాఖ నిరంతర నిఘాతో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఉక్కుపాదం మోపుతూ వచ్చింది.
Illegal Liquor Supply in Elections :ఎన్నికల నగారా మోగినప్పటి నుంచి గుడుంబా తయారీపై రాష్ట్రవ్యాప్తంగా 9వేల181 కేసులు నమోదు చేసి 2,621 మందిని అరెస్ట్ చేశారు. పెద్దఎత్తున గుడుంబా తయారీకి ఉపయోగించే సరుకుతో పాటు 349 వాహనాలు సీజ్ చేశారు. మాదకద్రవ్యాలకి సంబంధించి 124 కేసులు నమోదుచేసి 181 మందిని అరెస్ట్‌చేసిన ఎక్సైజ్‌శాఖ భారీగా గంజాయి అల్ఫాజోలం, ఎండీఎంఏ తదితర మాదకద్రవ్యాలు సీజ్ చేసింది. నిబంధనలు ఉల్లంఘించి మద్యం విక్రయాలు చేసిన వారిపై 3వేల 606 కేసులు నమోదు చేసి 3వేల383 మందిని అరెస్టు చేయడంతో పాటు 638 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసింది. నాన్ డ్యూటీపెయిడ్ లిక్కర్ అమ్మిన వారిపై 182 కేసులు నమోదు చేసి 87 మందిని అరెస్టు చేశారు. కల్తీకల్లుతోపాటు అక్రమంగా కల్లు అమ్మినవారిపై 2800కి పైగా కేసులు నమోదు చేసి 174 మందిని అరెస్టు చేశారు.