తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణలో త్వరలోనే మద్యం ధరల పెంపు! - ఒక్కో బాటిల్​పై భారీగా వడ్డింపు!!

తెలంగాణలో త్వరలో పెరగనున్న మద్యం ధరలు - ఏపీ మద్యం ధరలకు సమానం చేయాలనే ఆలోచన - సవరించే దిశగా అడుగులు వేస్తున్న ఆబ్కారీ శాఖ

Liquor Prices Will Increase in Telangana
Liquor Prices Will Increase in Telangana (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 5 hours ago

Liquor Prices Will Increase in Telangana : తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలను సవరించే దిశగా ఆబ్కారీ శాఖ కసరత్తు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలకు సమానం చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. త్వరలో బీరుపై రూ.20, లిక్కర్‌పై తక్కువలో తక్కువ క్వార్టర్‌పై రూ.20 నుంచి రూ.70 వరకు పెంపు ఉంటుందని ఆబ్కారీ శాఖ అధికారులు చెబుతున్నారు. ధరలు పెంచడం ద్వారా ప్రతి నెలా రూ.1000 కోట్లు అదనంగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తున్నట్టు తెలుస్తోంది.

పెరుగుతున్న గుడుంబా కేసులు :తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ఎక్సైజ్‌ శాఖలో ఆదాయం రావడం లేదు. రాష్ట్రంలో గుడుంబాతో పాటు అక్రమ మద్యం తయారీ, సరఫరా, విక్రయాలు పెరిగాయని ఆ శాఖ ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 6 నెలల్లో నమోదు చేసిన కేసుల సంఖ్య స్పష్టం చేస్తోంది. గత ఏడాది మొదటి ఆరు నెలల్లో 9,108 గుడుంబా కేసులు నమోదు కాగా, ఈ ఏడాది అదే సమయంలో 18,826 కేసులు నమోదు అయ్యాయి. అంటే రెట్టింపు కేసులు నమోదు కావడంతో పాటు పది వేల మందికి పైగా గుడుంబా కేసుల్లో అరెస్టు చేశారు.

అక్రమ మద్యం సరఫరా, గుడుంబా తయారీని అరికట్టేందుకు ఆబ్కారీ శాఖ అధికారులు కఠినంగా ముందుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇదే సమయంలో ఈ ఆర్థిక సంవత్సరానికి ఎక్సైజ్‌ శాఖ ద్వారా వ్యాట్‌, ఎక్సైజ్‌ డ్యూటీల ద్వారా రూ.36 వేల కోట్లకు పైగా ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ ఆర్థిక ఏడాది ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్ వరకు 6 నెలల్లో ఆబ్కారీ శాఖకు వచ్చిన ఆదాయం ఎక్సైజ్‌ డ్యూటీ ద్వారా రూ.9,493 కోట్లు, వ్యాట్‌ ద్వారా మరో రూ.8,040 కోట్లు వచ్చింది. అంటే ఇప్పటి వరకు ఆ రెండింటి ద్వారా దాదాపు రూ.17,533 కోట్ల రాబడి వచ్చినట్లు ఆబ్కారీ శాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి. మిగిలిన ఆరు నెలల్లో ఇదే మొత్తం వస్తుందని అంచనా వేస్తే, ఈ ఆర్థిక సంవత్సరం రూ.35,000 కోట్లకు మించే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు.

వైరల్ వీడియో : నడిరోడ్డుపై ఏరులై పారిన మద్యం - బాటిళ్ల కోసం ఆశగా ఎదురుచూసిన జనం

ధరలు సవరించే దిశలో అబ్కారీ శాఖ : ఇటీవల వాణిజ్య పన్నులు, ఆబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వితో సమీక్ష చేసిన సీఎం రేవంత్ రెడ్డి రాబడులను పెంచుకునేందుకు కఠినంగా ముందుకు వెళ్లాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే గుడుంబా, అక్రమ మద్యం నిరోధానికి కఠిన చర్యలు చేపట్టారు. ప్రత్యేక బృందాలు అదే పనిలో ఉన్నట్లు ఆబ్కారీ శాఖ అధికారులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు అధికంగా ఉన్నట్లు విమర్శలు రావడంతో గత ప్రభుత్వం 2023 మే నెలలో బీరుపై రూ.10, లిక్కర్‌పై రూ.20 లెక్కన తగ్గించింది. ఆదాయం పెంచాలని ఇప్పటి ప్రభుత్వం చెబుతుండటంతో గతంలో తగ్గించిన ధరలతో పాటు మరికొంత అదనంగా చేర్చి ధరలు పెంచాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మద్యం ధరలను వీలైనంత త్వరగా సవరించాలని ఎక్సైజ్‌ శాఖ యోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో బీరు ధర రూ.170 నుంచి రూ.200 వరకు ఉండగా, ఇక్కడ రూ.150 నుంచి రూ.180 వరకు ఉన్నట్లు మందుబాబులు చెబుతున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో బీరుపై కనీసం రూ.20 పెంచాలని యోచిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా లిక్కర్‌పై మూడు, నాలుగు బ్రాండ్లపై క్వార్టర్‌పై రూ.20 ధర పెంచనుండగా, మిగిలిన బ్రాండ్ల క్వార్టర్‌పై రూ.50 నుంచి రూ.70 వరకు పెంచనున్నట్లు తెలుస్తోంది. ఒక్కో ఫుల్‌ బాటిల్‌పై రూ.80ల నుంచి రూ.300 వరకు పెంచాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇలా పెంచినట్లయితే ఇప్పుడున్న ధరల కంటే 15 శాతం నుంచి 20 శాతానికి పైగా ధరలు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

అలా జరిగితే పెరిగే లాభం :వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు, బార్‌లు, క్లబ్‌లు, పబ్‌లు అన్నింటి ద్వారా రోజుకు సగటున రూ.100 కోట్లకు పైగా విలువైన మద్యం అమ్ముడుపోతోంది. అంటే నెలకు సగటున రూ.3000 కోట్ల నుంచి రూ.3500 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ధరలు సవరించినట్లయితే ప్రతి నెలా దాదాపు రూ.వెయ్యి కోట్ల వరకు అదనంగా రాబడి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. రాబోయే 5 నెలల్లో ఇప్పుడున్న అంచనా కంటే మరో రూ.ఐదు వేల కోట్లు అదనంగా ఖజానాకు చేరే అవకాశం ఉందని ఆబ్కారీ శాఖ ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. అధికారుల అంచనా మేరకు ఆదాయం వచ్చినట్లయితే ఎక్సైజ్‌ శాఖ నుంచి రూ.40 వేల కోట్లకుపైగా ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

మద్యం ప్రియులకు గుడ్​న్యూస్ - మరింత తగ్గనున్న ధరలు! - అందుబాటులోకి కోరుకున్న కొత్త బ్రాండ్లు!!

మద్యం షాపుల వారికి హెచ్చరిక - మొదటి తప్పునకు రూ.5 లక్షల జరిమానా

ABOUT THE AUTHOR

...view details