Telangana Electricity Regulatory Commission on Income : విద్యుత్ పంపిణీ సంస్థల వార్షిక ఆదాయ వనరులపై విద్యుత్ నియంత్రణ మండలి బహిరంగ విచారణ చేపట్టింది. ఎస్పీడీసీఎల్కు సంబంధించిన వార్షిక ఆదాయ నివేదికపై బహిరంగ విచారణ చేపట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25లో డిస్కంలకు రూ. 14 వేల 222 కోట్లు ఆదాయలోటు ఉన్నదని డిస్కంలు విద్యుత్ నియంత్రణ మండలికి పిటిషన్ దాఖలు చేశాయి. ఉత్పత్తి సంస్థల నుంచి కొంటున్న కరెంట్‌కు, వినియోగదారులకు పంపిణీ చేస్తున్న విద్యుత్‌కు భారీగా లోటు ఉందని వాటిని పూడ్చుకునేందుకు చార్జీలు పెంచుకునేందుకు స్వల్పంగా అవకాశం ఇవ్వాలని డిస్కంలు ఈఆర్సీ ఎదుట పిటిషన్ దాఖలు చేశాయి. ఇందులో ఛార్జీల పెంచడం ద్వారా రూ.1,200 కోట్లు సమకూరితే, మిగిలిన 13 వేల 22 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీ రూపంలో అందుతుందని ఈఆర్సీకి నివేదించాయి.
ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ, సంస్థ ఇతర ఉన్నతాధికారులు ఈ బహిరంగ విచారణకు హాజరయ్యారు. విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదని, ఎల్.టి, హెచ్.టీ వినియోగదారుల నుంచి ఫిక్స్‌డ్ ఛార్జీల రూపేణా వసూలు చేసే వెసులుబాటు కల్పించాలని సీఎండీ ముషారఫ్ ఫరూఖీ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ తరుఫున వాదనలు వినిపించిన మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ఛార్జీలు పెంచకూడదని పేర్కొన్నారు.