DSC Selected Candidates Posting Updates :డీఎస్సీలో అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టుల్లో ఏదో ఒక దానికే ఎంపికయ్యేలా పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇటీవల డీఎస్సీ ఫలితాలు వెల్లడి కాగా వందల మంది అభ్యర్థులు రెండు, మూడు పోస్టులకు ఎంపికయ్యారు. దీంతో వారు ఏదైనా ఒక దాంట్లో చేరితే మళ్లీ వందల పోస్టుల్లో ఖాళీలు ఏర్పడతాయి. ఈ పరిస్థితిని నివారించేందుకు తొలుత ఎస్‌ఏ విభాగంలో 1:1 నిష్పత్తిలో లిస్ట్ విడుదల చేస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఆ తర్వాత ఎస్‌జీటీకి ఎంపికైన వారి ఫలితాలు విడుదల చేస్తామన్నారు. మొదటి జాబితాలో ఉన్న వారెవరైనా రెండో జాబితాలో ఉంటే ఆ పేరును తొలగించి తర్వాత మెరిట్‌లో ఉన్న వారిని చేరుస్తామని స్పష్టం చేశారు. ఆ మేరకు సాఫ్ట్‌వేర్‌ను కూడా సిద్ధం చేసినట్లు వెల్లడించారు.
దానిపై సీఎంకు లేఖ :ఉదాహరణకు సిద్దిపేట జిల్లాలో 43 మంది అభ్యర్థులు రెండు, మూడు పోస్టులకు ఎంపికయ్యారు. వారికి డీఈవో కార్యాలయ సిబ్బంది ముందుగానే ఫోన్ చేసి ఏ పోస్టు కావాలో డిక్లరేషన్ తీసుకుని వారికి నచ్చిన పోస్టును ఇస్తున్నారు. మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి 1:3 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలన శనివారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. మరోవైపు ఖాళీలు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులకు కూడా అన్ని జిల్లాల్లో ధ్రువపత్రాల పరిశీలన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి ఒక ప్రకటనలో కోరారు. తక్కువ సమయంలో టీచర్లకు నియామక పత్రాలు ఇవ్వనుండటం అభినందనీయమని ఆనందించారు.
స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులు భర్తీ చేయాలి : ప్రత్యేకావసరాల విద్యార్థులకు బోధించేందుకు ఈసారి 220 ఎస్‌ఏ, 796 ఎస్‌జీటీ స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులను భర్తీ చేయాలి. ఈ పోస్టులకు టెట్ అర్హత అవసరం లేదని గత ఏప్రిల్‌లో 62మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో 17 జిల్లాల్లోనే ధ్రువపత్రాల పరిశీలన చేశామని, 16 జిల్లాల్లో జరగలేదని విద్యాశాఖ వర్గాలు పేర్కొన్నాయి.