Telangana Cyber Security on Fake URL and Sim Cards : సైబర్ నేరగాళ్లు రోజురోజుకు తమ నేరాల తీరును మార్చుకుంటూ మోసాలకు పాల్పడుతున్నారు. టెక్నాలజీతో వేల కోట్లు రూపాయలు కొట్టేస్తున్నారు. ఇతరుల పేరు మీద మ్యూల్ సిమ్‌కార్డులు తీసుకుని మెసేజ్‌లు పంపిస్తూ, ఫోన్ కాల్స్ చేస్తూ భయాందోళనకు గురిచేసి ఖాతాలోని డబ్బంతా ఖాళీ చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు ఉపయోగిస్తున్న నకిలీ వెబ్‌సైట్లు, యూఆర్‌ఎల్‌ల భరతం పట్టేందుకు తాజాగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్‌బీ) సాంకేతిక అస్త్రం ప్రయోగిస్తోంది. కేవలం సైబర్ నేరగాళ్లను మాత్రమే అరెస్టు చేయడమే కాకుండా వారు ఉపయోగిస్తున్న వెబ్‌సైట్లు, ఫోన్లు, సిమ్‌లు పనిచేయకుండా నిర్వీర్యం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాదిలో సుమారు 25 వేల సిమ్‌లు, ఐఎంఈఐ నంబర్లను బ్లాక్ చేయగా 1825 నకలీ వెబ్‌సైట్లను నిర్వీర్యం చేసింది. ఇది సైబర్ సెక్యూరిటీ బ్యూరోలోని రెండు విభాగాలతో సాధ్యమవుతోంది.
డేటా అగ్రిగేషన్ అనాలసిస్ యూనిట్ :సైబర్ నేరగాళ్లు ఉపయోగించే వెబ్‌సైట్లు, ఫోన్ నంబర్లు, బ్యాంకు ఖాతాలు, యాప్‌లు, ఈమెయిల్ ఐడీ తదితరాలపై డేటా అగ్రిగేషన్ అనాలసిస్ యూనిట్ దృష్టి సారిస్తోంది. సైబర్ నేరం జరిగిన సమయంలో లభించే సాంకేతిక ఆధారాలతో గూగుల్, ఇతర సామాజిక మాధ్యమ సంస్థలు, టెలికాం ఆపరేటర్లను సంప్రదించి నకలీ డేటా మూలాలు సేకరిస్తారు. ఇప్పటివరకు సుమారు 50 వేలకుపైగా యూఆర్‌ఎల్, 40 వేలకుపైగా సిమ్‌కార్డులనును విశ్లేషించినట్లు అధికారులు వెల్లడించారు.