తెలంగాణ

telangana

ETV Bharat / state

100 మందే 10వేల నేరాలు చేశారు - తెలంగాణ పోలీసులు ఎలా చెక్ పెడుతున్నారంటే! - TG POLICE FOCUS ON CYBER CRIMINALS

10,000 నేరాలకు పాల్పడిన 100 మంది చిట్టా సిద్ధం చేసిన తెలంగాణ సైబర్ పోలీసులు - కేసులన్నింటిని ఒకేచోట చేరుస్తున్న తెలంగాణ పోలీసులు - సైబర్ నేరాల నియంత్రణకు పక్కా వ్యూహం

Telangana Police Focus On Cyber Criminals
Telangana Police Focus On Cyber Criminals (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 3, 2025, 7:54 PM IST

Telangana Police Focus On Cyber Criminals : 'చేతిలో స్మార్ట్​ఫోన్ ఉంటే చాలు. దేశంలో ఎవర్నయినా బోల్తా కొట్టించొచ్చు. అక్కడో నేరం ఇక్కడో క్రైం చేస్తూ అందినకాడికి దోచుకోవచ్చు. ఎక్కడైనా పోలీసులకు చిక్కినా ఇలా జైలుకు వెళ్లి అలా బెయిల్‌ పొందొచ్చు' ఇదీ సైబర్‌ కేటుగాళ్ల లెక్క. వీరిపై ఎక్కడికక్కడ పలు కేసులు నమోదవుతున్నాయి, అరెస్టులు చేస్తున్నారు. అయితే, పోలీసులు తమ ప్రాంతంలో నమోదైన నేరాన్నే పరిగణనలోకి తీసుకుంటుండటం వల్ల వారు బయటికి వచ్చాక మళ్లీ నేరాలకు పాల్పడుతున్నారు.

100 మంది 10వేల నేరాలు :అందుకే చిత్రగుప్తుడి చిట్టా మాదిరిగా ఒక్కో నేరగాడు ఎన్ని నేరాలకు పాల్పడ్డాడన్న విషయంపై తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో ఫోకస్ పెట్టింది. వేర్వేరు ప్రాంతాల్లో నమోదవుతున్న కేసుల ఆధారంగా సైబర్ నేరగాళ్ల ప్రొఫైళ్లను సిద్ధం చేస్తోంది. అందులో భాగంగానే ఇప్పటివరకు దేశవ్యాప్తంగా దాదాపు 10,000 నేరాలకు పాల్పడిన 100 మంది చిట్టాను సిద్ధం చేసింది. అంటే ఒక్కో నేరగాడు సగటున 100 నేరాలకు పాల్పడ్డాడన్నమాట.

ఒకే వ్యక్తి/ముఠా ఎక్కువ నేరాలకు పాల్పడినట్లుగా నిర్ధారించగలిగితే వారిని ఎక్కువ కాలం రిమాండులో ఉంచవచ్చు, ఎక్కువ శిక్షపడే విధంగా చేయవచ్చు. తద్వారా వీరు మళ్లీమళ్లీ నేరాలకు పాల్పడకుండా నిరోధించవచ్చు. అయితే, చాలా రాష్ట్రాలు సైబర్‌ నేరగాళ్ల గురించి అంతగా పట్టించుకోవడంలేదు. నేరగాళ్లపై కేసు నమోదు చేసి వదిలేస్తున్నారు. తమకు సరైన సాంకేతిక పరిజ్ఞానం, మానవ వనరులు లేవనే కారణాన్ని వారు చెబుతున్నారు. సైబర్‌ నేరాల కట్టడి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు మాత్రం వినూత్న రీతిలో ముందుకు వెళ్తున్నారు.

'సైకాప్స్' ద్వారా నిందితుల ఫోన్ నంబర్ల విశ్లేషణ :సైబర్‌ నేరగాడి ప్రధాన ఆయుధం స్మార్ట్ ఫోన్. దాంతోనే మొత్తం కథ నడిపిస్తాడు. ఎక్కడో మారుమూలన కూర్చొని దేశవ్యాప్తంగా కాల్స్​ను చేస్తుంటాడు. ఇలాంటి మోసగాళ్లు వాడిన ఫోన్‌ నంబర్లు, ఐపీ చిరునామాలు, వెబ్‌సైట్లు, జరిగిన సైబర్‌ నేరం తదితరాలకు సంబంధించిన వివరాలను ఇండియన్‌ సైబర్‌ క్రైం కోఆర్డినేషన్‌ సెంటర్‌(ఐ4సీ) సేకరిస్తుంది. రాష్ట్ర పోలీసులు ఈ ఐ4సీ కేంద్రం నుంచి సమాచారం తెప్పించారు. తెలంగాణలో జరిగిన సైబర్‌ నేరాలకు, వాటిలో నిందితులు వాడిన ఫోన్‌ నంబర్‌లను ‘సైబర్‌ క్రైం ఎనాలసిస్‌ అండ్‌ ప్రొఫైలింగ్‌ సిస్టం (సైకాప్స్‌)’ద్వారా విశ్లేషించారు.

దాంతో ఆయా నంబర్‌లతో దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ కేసులు నమోదయ్యాయనే విషయాలను తేల్చారు. ఐపీ చిరునామా, ఐఎంఈఐ నంబర్‌లతోనూ ప్రయత్నించి కేసుల వివరాలను తెలుసుకున్నారు. నిరుడు 14,984 సిమ్‌కార్డులు, ఐఎంఈఐ నంబర్ల ద్వారా 9,811 ఫోన్లను బ్లాక్‌ చేశారు. ఈ వివరాల ఆధారంగా అత్యధికంగా నేరాలకు పాల్పడిన 100మంది ప్రొఫైల్స్‌ను సిద్ధం చేశారు. వీరు దేశవ్యాప్తంగా 10 వేలకుపైగా నేరాలకు పాల్పడ్డట్లు ఆధారాలతోసహా పోలీసులు గుర్తించారు. ఈ వివరాలన్నింటినీ ఆయా రాష్ట్రాలకు పంపించారు.

ఇక అజ్ఞాతంలోకి వెళ్లడం కష్టమే :గతంలో ఏదైనా రాష్ట్రంలో పోలీసులు నిందితుడిని అరెస్టు చేస్తే, బెయిల్‌ వచ్చిన వెంటనే అజ్ఞాతంలోకి వెళ్లిపోయేవాడు. ఇప్పుడు నిందితుడు ఎక్కడ అరెస్టు అయినా తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో చొరవతో నిందితుడి సమాచారం అన్ని రాష్ట్రాలకూ వెళుతోంది. ఫలితంగా అతన్ని ఆయా రాష్ట్రాలకు చెందిన పోలీసులు సైతం తీసుకెళ్లి జైళ్లలో ఉంచుతున్నారు. తద్వారా వీరు మళ్లీ సైబర్ నేరాలకు పాల్పడకుండా నిరోధించగలుగుతున్నారు. ఇలాంటి వారందర్నీ అరెస్టు చేయగలిగితే నేరాల ఉద్ధృతి కొంతైనా తగ్గించవచ్చని పోలీసు అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

గూగుల్​లో కనిపించే వెబ్​సైట్​ అసలైందా? నకిలీదా? - ఇలా ఈజీగా గుర్తించండి

'హిందీ, ఇంగ్లీష్​ వచ్చిన వారే టార్గెట్ - సీబీఐ, ఈడీ అధికారులమని చెప్పి సర్వం దోచేస్తారు'

ABOUT THE AUTHOR

...view details