Cyber Bot :సైబర్ నేరాలు రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో ఫిర్యాదుల స్వీకరణకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(TGCSB) చాట్‌బాట్ వ్యవస్థను అందుబాటులోకి తేనుంది. ఇకనుంచి బాధితులు నేరుగా చాట్‌బాట్ వ్యవస్థ ఇచ్చే సూచనలకు అనుగుణంగా వివరాలను నమోదు చేస్తే ఫిర్యాదులు నమోదు అవుతాయి. ఇప్పటికే ఇలాంటి తరహా వ్యవస్థను పంజాబ్, గుజరాత్‌లోని సూరత్, అండమాన్ నికోబార్ తదితర పోలీస్ విభాగాలు వినియోగిస్తున్నాయి. ఈ సైబర్బాట్ పేరుతో తీర్చిదిద్దిన చాట్‌బాట్‌ను టీజీసీఎస్బీ ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది.
ప్రస్తుతం సైబర్ నేరానికి పాల్పడిన బాధితులు 1930కు ఫోన్ చేయడమో, నేషనల్ సైబర్‌క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో లాగిన్ అయి ఫిర్యాదులు చేస్తున్నారు. 1930 నంబర్‌కు తెలంగాణ నుంచి బాధితులు ఎవరైనా ఫోన్ చేస్తే వెంటనే టీజీసీఎస్బీ కాల్‌సెంటర్‌కు కాల్ వెళుతుంది. ప్రస్తుతం ఈ కాల్ సెంటర్లో 20 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా మూడు షిఫ్టుల్లో పని చేస్తున్నారు. ఈరోజుల్లో సైబర్ నేరాలు పెరగడంతో పలువురు బాధితులు నిమిషాల తరబడి కాల్వెయిటింగ్లో ఉండాల్సిన పరిస్థితి వస్తోంది.
ఇలా వెయిటింగ్ చేయించకుండా బాధితులకు లింక్ పంపి, దానిలో వివరాలను నమోదు చేసి ఫిర్యాదు స్వీకరించే ప్రక్రియను సైబర్ పోలీసులు అందుబాటులోకి తీసుకొచ్చారు.కానీ తాజాగా చాట్‌బాట్ ప్రయోగంపై టీజీసీఎస్బీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈక్రమంలో 24 గంటలపాటు ఏ క్షణమైనా బాధితులు నేరుగా ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పించనున్నారు. ఇందుకు వాట్సప్ నంబర్‌నూ కేటాయించనున్నట్లు సైబర్ పోలీసులు వర్గాలు వెల్లడించాయి.