Cyber Criminals Eye on Loan Waivers:కాదేదీ సైబర్ నేరగాళ్లకు అనర్హం అన్నట్లుగా తయారయ్యింది వారి పరిస్థితి. ప్రజలను మోసగించేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని కూడా సైబర్ కేటుగాళ్లు వదులుకోవడం లేదు. మారుతున్న పరిణామాలు ఆసరాగా చేసుకుని అందుబాటులో ఉన్న సాంకేతికతను ఉపయోగించి ప్రజల సొమ్ము కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ ప్రకటించడంతో రైతులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనిని ఆసరాగా తీసుకుని సైబర్ నేరస్తులు లింకులు పంపి మోసాలకు పాల్పడుతున్నారు.
బ్యాంకులోగోతే ఉండే నంబర్ల నుంచి :తాజాగాప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసిన నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు ఆ పథకం లబ్ధిదారులపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. బ్యాంకు లోగోతో ఉండే వాట్సాప్ నంబర్ల నుంచి మోసపూరిత ఫైల్స్, లింక్‌లను పంపిస్తున్నారు. పొరపాటున అటువంటి లింక్‌లపై క్లిక్ చేశారో ఇక అంతే సంగతులు. అలా చేయడం ద్వారా ఫోన్ హ్యాకవ్వడం, లేదా ఎనీడెస్క్ యాప్ వంటివి మీ సెల్ఫోన్లో డౌన్లోడ్ అవుతాయి.
వెంటనే ఫోన్‌ను సైబర్ నేరగాళ్లు వారి ఆధీనంలోకి తీసుకుని మీ బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బును కొట్టేసే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. తెలంగాణలో రైతు రుణమాఫీ చేస్తున్న నేపథ్యంలో కొందరికి వాట్సాప్‌లో నకిలీ మెసేజ్‌లు వస్తున్నట్లు సైబర్ క్రైమ్ విభాగం పోలీసులు గుర్తించారు. అనుమానాస్పద లింకులతో నకిలీ మెసేజ్‌లు వస్తున్నాయని ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని నమ్మొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.