తెలంగాణ

telangana

ETV Bharat / state

కాంగ్రెస్​లో నామినేటెడ్​ పోస్టుల లొల్లి - ఆచితూచి అడుగులు వేస్తున్న అధిష్ఠానం

Telangana Congress Nominated Posts Issue : తెలంగాణ రాష్ట్రంలో నామినేటెడ్‌ పోస్టుల భర్తీ విషయంలో రోజు రోజుకు ఒత్తిళ్లు తీవ్రతరం అవుతుండడంతో రాష్ట్ర కాంగ్రెస్‌ ఆచితూచి అడుగులు ముందుకేస్తోంది. శాసనసభ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పని చేసిన, అసెంబ్లీ టికెట్లు కోల్పోయిన నాయకులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చే దిశలో కసరత్తు చేస్తోంది.

Congress Nominated Posts Issue
Telangana Congress Nominated Posts Issue

By ETV Bharat Telangana Team

Published : Feb 24, 2024, 10:35 AM IST

Telangana Congress Nominated Posts Issue : రాష్ట్రంలో అధికార బాధ్యతలు చేపట్టిన కాంగ్రెస్‌ పార్టీ తాజాగా నామినేటెడ్‌ పదవుల(Nominated Posts) భర్తీపై ప్రత్యేక దృష్టిసారించింది. శాసనసభ ఎన్నికల సమయంలో ఏఐసీసీతోపాటు రాష్ట్ర సమన్వయ కమిటీ, ఇతర నాయకులు ఇచ్చిన హామీల మేరకు ఎన్నికల్లో కష్టపడి పని చేసిన వారందరికి నామినేటెడ్‌ పదవులు కట్టబెట్టేందుకు కసరత్తు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికలప్పుడు టికెట్లు ఆశించి దక్కని నాయకులు, పార్టీ గెలుపునకు పని చేసిన నాయకులను గుర్తించి నామినేటెడ్‌ పదవులు ఇచ్చే విషయంలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. ఇదే విషయాన్ని ఏఐసీసీ కూడా స్పష్టం చేసినట్లు సమాచారం.

50కి పైగా నామినెటెడ్‌ పోస్టులు ఉండడంతో అన్నీ ఒకేసారి భర్తీ చేయాలా విడతల వారీగా భర్తీ చేయాలా లేక విడతల వారీగా చేయాలనే దానిపై రాష్ట్ర నాయకత్వం ఎటూ తేల్చుకోలేకపోతున్నట్లు సమాచారం. అయితే లోక్​సభ ఎన్నికలు(Lok Sabha Election 2024) త్వరలో ఉండడంతో నామినేటెడ్‌ పదవుల ప్రభావం ఆ ఎన్నికలపై ఉండే అవకాశం ఉండడంతో జాగ్రత్త పడుతున్నారు. ఇప్పటికే నాయకులను మూడు కేటగిరిలుగా విభజించి సామాజిక సమీకరణాలు దెబ్బతినకుండా జాబితాలు సిద్దం చేసుకుని ఏఐసీసీతో కూడా గ్రీన్‌ సిగ్నల్​ పొందినట్లు తెలుస్తోంది.

ప్రధాన పోస్టుల వివరాలు : వక్స్​బోర్డు ఛైర్మన్​, ఫైనాన్స్​ కమిషన్​ ఛైర్మన్​ పదవులను భర్తీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన వాటిని కూడా ఒక్కొక్కటే భర్తీ చేస్తుందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రధానంగా ఆర్టీసీ(TSRTC), టీఎస్​ఐఐసీ, మహిళ కమిషన్, ఆగ్రో, రైతు బంధు సమితి, పర్యాటకం, మార్క్​ఫెడ్​, సీడ్​ డెవలప్​మెంట్​ కార్పొరేషన్, ఆయిల్​ఫెడ్​, వేర్​ హౌసింగ్​, ఫిషరీస్​ కో ఆపరేటివ్​, డైరీ డెవలప్​మెంట్​, బీసీ డెవలప్​మెంట్​ కార్పొరేషన్​, పౌర సరఫరాల కార్పొరేషన్​, హైర్​ ఎడ్యుకేషన్​ కౌన్సిల్​, ఫారెస్ట్​ డెవలప్​మెంట్​ తదితర 50కి పైగా కార్పొరేషన్ల ఛైర్మన్​ పోస్టులతో పాటు దేవాలయాల ట్రస్ట్​ బోర్డు ఛైర్మన్లు, మార్కెట్​యార్డ్​ ఛైర్మన్లు ఇలా వివిధ రకాల నామినేటెడ్​ పదవులను భర్తీ చేయాల్సి ఉండడంతో మొదట 50కి పైగా ఉన్న రాష్ట్ర స్థాయి నామినేటెడ్​ పదవులను భర్తీ చేయనున్నారు.

కాంగ్రెస్​లో ఎంపీ టికెట్ల పంచాయితీ - కుటుంబీకులకు ఇప్పించేందుకు ముఖ్యనేతల విశ్వ ప్రయత్నాలు!

T Congress Nominated Posts :అయితే నామినేటెడ్​ పదవుల భర్తీ విషయంలో ఆరోపణలు, అసంతృప్తులు ఎదురుకాకుండా జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే టీఎస్​పీఎస్సీ(TSPSC) బోర్డు ఛైర్మన్​, సభ్యుల భర్తీలో ఛైర్మన్​తో పాటు ఒకరిద్దరు సభ్యులు పార్టీలో ఎలాంటి సేవలు చేయకపోయినా అవకాశం కల్పించారనే విమర్శలు వచ్చాయి. దీంతో నామినేటెడ్​ పదవుల భర్తీ విషయంలో అలాంటి విమర్శలకు తావులేకుండా పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్​ రెడ్డి జాబితాలు రూపకల్పనలో ఒకటికి రెండుసార్లు పరిశీలన చేశారు. ఆ పరిశీలన చేసిన జాబితాను ఏఐసీసీ కార్యదర్శులు ఇచ్చిన జాబితాను కూడా నిశితంగా పరిశీలించి సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. పదవులు ఇవ్వాలనుకున్న నాయకులకు సంబంధించి ఇప్పటికే నిఘా వర్గాలకు సమాచారం ఇచ్చి ఎంక్వైరీలు కూడా పూర్తి చేయించుకున్నట్లు తెలుస్తోంది. కుటుంబ, రాజకీయ నేపథ్యాలతో పాటు ఇతర అంశాలపై కూడా నిఘా వర్గాలు ఆరా తీసి నివేదికలు అందజేసినట్లు సమాచారం.

నామినేటెడ్​ పదవుల కోసం వేచి చూస్తున్న ఆశావహుల వివరాలు :

  • ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి సొంత జిల్లా మహబూబ్​నగర్​ నుంచి పీసీసీ ప్రధాన కార్యదర్శి చారకొండ వెంకటేశ్​, యువజన కాంగ్రెస్​ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనా రెడ్డి, ఓబీసీ జాతీయ సమన్వయకర్త కేతూరి వెంకటేశ్​, మహబూబ్​నగర్​ మాజీ డీసీసీ అధ్యక్షుడు ఒబెదుల్లా కొత్వాల్​, కొల్లాపూర్​ నుంచి జగదీశ్వరరావు, మెదక్​ నుంచి పీసీసీ అధికార ప్రతినిధి ఎం.భవానిరెడ్డి, బండారు శ్రీకాంత్​రావు, ఎంఏ ఫయూమ్​, హైదరాబాద్​ నుంచి మెట్టు సాయికుమార్​, వచన్​కుమార్​, మోతా రోహిత్​ ముదిరాజ్​, నూతి శ్రీకాంత్​గౌడ్​, శ్రీకాంత్​ యాదవ్​, జి.నిరంజన్​, అల్లం భాస్కర్​, నిజాముద్దీన్​లు ఆశిస్తున్నారు.
  • ఉమ్మడి రంగారెడ్డి నుంచి పీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్‌ కౌసిక్‌ యాదవ్‌, సామా రామ్మోహన్‌ రెడ్డి, భూపతి రెడ్డి నర్సారెడ్డి, మల్​రెడ్డి రామిరెడ్డి, కిషోర్ రెడ్డి, దర్పల్ రాజశేఖర్ రెడ్డి, జక్కిడి ప్రభాకర్ రెడ్డి, రఘునాథ్‌ యాదవ్‌, సత్యం శ్రీరంగం, కల్వ సుజాత, మాజీ మంత్రి పుష్పలీలలు ఆశిస్తున్నారు. కరీంనగర్ నుంచి సత్తు మల్లేషు, గజ్జల కాంతం, నేరెళ్ల శారద, అలిగిరెడ్డి ప్రవీన్‌ రెడ్డి, రోహిత్‌ రావ్‌, వరంగల్ నుంచి రవళి రెడ్డి, లింగోజి, జంగా రాఘవ రెడ్డి, మొగుళ్ల రాజిరెడ్డి, నెహ్రునాయక్‌, మేకల వీరన్నయాదవ్‌, బెల్లయ్యనాయక్‌, బండి సుధాకర్‌ గౌడ్‌, ఖమ్మం నుంచి లోకేశ్​ యాదవ్, సత్యనారాయణ గౌడ్‌, పోట్ల నాగేశ్వరరావు, విజయాబాయి, రాయల నాగేశ్వరరావులు ఛైర్మన్‌ పదవులు కోరుకుంటున్నారు.
  • నల్లగొండ నుంచి పున్న కైలాస్ నేత, పటేల్ రమేష్ రెడ్డి, చెవటి వెంకన్నయాదవ్, ప్రీతం, శంకర్ నాయక్, బండ్రు శోభారాణి, నిజామాబాద్ నుంచి మాజీ ఎమ్మెల్యే ఇరావత్రి అనిల్ కుమార్, వేణుగోపాల్ యాదవ్, మోహన్‌ రెడ్డి, గంగారాం, కిసాన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అన్వేశ్​ రెడ్డి, అదిలాబాద్ నుంచి విశ్వప్రసాద్‌ రావు, నరేశ్​ జాదవ్‌, సేవాలాల్ రాథోడ్, బెల్లయ్యనాయక్‌, గోమాత శ్రీనివాస్‌ తదిరులు ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. వీరంతా తమకు ఎప్పుడు పదవులు వరిస్తాయా అని వేచి చూస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవికి మల్లు రవి రాజీనామా

తొలి లోక్‌సభ అభ్యర్థిని ప్రకటించిన సీఎం రేవంత్‌ - మిగతా 16 స్థానాల్లో పోటీ చేసేది ఎవరనే అంశంపై ఉత్కంఠ

ABOUT THE AUTHOR

...view details