CM Revanth Participate ISB Leadership Summit 2024 : త్యాగాలు చేయకుండా గొప్ప నాయకులం కాలేమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మంచి లీడర్ అవ్వాలంటే త్యాగం చేసే గుణం, ధైర్యంతో ముందుకెళ్లే తత్వం ఉండాలని తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నాయకత్వ శిఖరాగ్ర సదస్సు - 2024లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఐఎస్బీలోని విద్యార్థులు నాయకత్వ లక్షణాలు మెరుగుపరుచుకునేందుకు ఏడాదికోసారి ప్రముఖులు, వక్తలతో యాజమాన్యం సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ ఏడాది ఐఎస్బీ లీడర్ షిప్ సమ్మిట్‌కు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరై, విద్యార్థులకు పలు సూచనలు చేశారు.
అనంతరం ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB)లో నిర్వహించిన లీడర్షిప్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు. ప్రజలతో మమేకం అవ్వగలిగితే ఏదైనా సాధించవచ్చని చెప్పుకొచ్చారు. జీవితంలో రిస్క్ లేకుండా గొప్ప విజయాలు సాధించలేమని అన్నారు. మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, మన్మోహన్ సింగ్, పీవీ నరసింహారావు సహా ఎంతో మంది నాయకులు మనందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. తాను నాయకత్వ లక్షణాలను వారి నుంచే నేర్చుకున్నానని గుర్తు చేశారు.
ISB Leadership Summit 2024 : నాయకులు డబ్బు, వ్యక్తిగత జీవితం, సమయం ఇలా చాలానే త్యాగాలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. మంచి లీడర్ కావాలంటే ధైర్యం, త్యాగం ఉండాలని విద్యార్థులకు సూచించారు. సిగ్గుపడకుండా ప్రజలతో మమేకమవ్వాలన్నారు. ఐఎస్బీలో ఉన్నవారంతా తెలంగాణ, దేశానికి అంబాసిడర్లు అని చెప్పారు. హైదరాబాద్ నగరాన్ని 600 మిలియన్ సిటీగా మార్చేందుకు మీ అందరి సహకారం కావాలని కోరారు. తెలంగాణను ఇతర రాష్ట్రాలతో పోల్చనన్నారు.
కేవలం ఆ నగరాలతోనే పోటీ : కేవలం న్యూయార్క్, పారిస్, లండన్‌తో పోల్చాలనుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మీరంతా తెలంగాణలో 2, 3 ఏళ్లు పని చేయాలని సూచించారు. తమ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీల తరహాలో మంచి జీతాలు ఇవ్వలేకపోవచ్చు కానీ, మంచి సవాళ్లు, జీవితానికి సరిపడా నాలెడ్జ్‌ను మాత్రం అందిస్తుందని చెప్పారు.
ఒలింపిక్స్‌లో పతకాలే లక్ష్యం : ఒలింపిక్స్‌లో భారత్ దురదృష్టవశాత్తు స్వర్ణ పతకాలు గెలవలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఒలింపిక్స్‌లో అత్యధిక పతకాలు గెలవడమే లక్ష్యంగా పని చేస్తున్నామని స్పష్టం చేశారు. వ్యాపారాల్లో రాణిస్తున్న వారు ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి ఐఎస్బీ లీడర్ షిప్ సమ్మిట్‌లో పిలుపునిచ్చారు.