Telangana Govt Clarity On Family Digital Card: తెలంగాణలో ఫ్యామిలీ డిజిటల్ కార్డు పొందేందుకు పౌరసరఫరాల శాఖ దరఖాస్తులు విడుదల చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్ అవుతున్న వదంతులపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. తెలుగు భాషలో ఫ్యామిలీ డిజిటల్ కార్డు అప్లికేషన్‌ను ఇప్పటి వరకు రూపొందించలేదని స్పష్టం చేసింది. ఫ్యామిలీ డిజిటల్ కార్డుపై ఎలాంటి దరఖాస్తులు స్వీకరించడం లేదని తెలిపింది.
వదంతులు నమ్మొద్దు : ఫ్యామిలీ డిజిటల్ కార్డు కోసం తెలుగులో ఒక అప్లికేషన్ రూపొందించి అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరగడాన్ని ప్రభుత్వం గమనించింది. గ్రామాల్లో రేషన్ కార్డు లేని కుటుంబాలు ఆ దరఖాస్తు పూర్తి చేసి ఆధార్ సంఖ్య, సభ్యుల జనన ధ్రువీకరణ పత్రాలు, కుటుంబ ఫొటో జత చేసి స్థానిక వీఆర్‌ఓలకు ఇవ్వాలని ప్రచారం జరుగుతోంది.
ఈ క్రమంలో కొంత మంది దళారులు లబ్ధిదారులతో దరఖాస్తులు నింపిస్తున్నారు. మండల కేంద్రాల్లో జిరాక్స్ సెంటర్లు, తహసీల్దార్ కార్యాలయాల వద్ద హడావుడి కనిపిస్తోంది. ఈ విషయం ప్రభుత్వం, పౌరసరఫరాల శాఖ దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించి, కుటుంబ డిజిటల్ కార్డుల కోసం దరఖాస్తు చేయడానికి పౌరసరఫరాల శాఖ ఎటువంటి దరఖాస్తు రూపొందించలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ ప్రకటన విడుదల చేశారు. దళారులను నమ్మి ప్రజలు మోసపోవద్దని సూచించారు.