TG Cabinet Meet Today :రాష్ట్ర మంత్రివర్గం ఈ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సమావేశం కానుంది. ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా రహదారులు, రైల్వే లైన్లు ధ్వంసం కావడంతోపాటు భారీ ఎత్తున పంట నష్టం సంభవించింది. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు రావడంతో ప్రజలు కట్టుబట్టలతో బయట పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. భారీ వర్షాలు వస్తాయని వాతావరణశాఖ చేసిన హెచ్చరికతో ప్రభుత్వం అప్రమత్తం కావడంతో చాలా వరకు ప్రాణనష్టం జరగకుండా అధికారులు నిలువరించగలిగారు.
పునరుద్ధరణకు ప్రణాళిక : ఇప్పటికే కేంద్ర బృందం కూడా రాష్ట్రంలో పర్యటించి పరిశీలన చేసింది. రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకునేందుకు, ధ్వంసమైన రహదారులు తిరిగి నిర్మించేందుకు, పంట పొలాల్లో వేసిన ఇసుక మేటలను తొలగించుడానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించడానికి సిద్ధమైంది. బాధిత ప్రాంతాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్లనుంది.
ఇప్పటికే రాష్ట్రంలో జరిగిన వరద నష్టాల అంచనాలను కేంద్రానికి అందజేశారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షాను కూడా కలిసి నివేదించారు. కేంద్ర బృందం వచ్చి వెళ్లిన తర్వాత కూడా ఇంతవరకు ఎలాంటి స్పందన లేకపోవడంతో, పరిహారంపై ఏవిధంగా ముందుకు వెళ్లాలన్న దానిపై ఇవాళ్టి కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
యూనివర్శిటీలపై చర్చ :మూడు విశ్వవిద్యాలయాల పేర్లను మార్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ ఇందుకు మంత్రి మండలి ఆమోదం కూడా ఉండాల్సి ఉండడంతో ఇవాళ ఆ మూడింటి గురించి చర్చించనుంది. అందులో చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం, సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ, కొండ లక్ష్మణ్ బాపూజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్‌లూమ్ టెక్నాలజీ ఉన్నాయి. ఈ మూడు యూనివర్శిటీలపై మంత్రివర్గ చర్చ ఉంటుందని సమాచారం.
హైడ్రాను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. హైడ్రాకు చట్టబద్దత కల్పించడం, రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ, పోలీసు, చిన్న నీటిపారుదల శాఖల నుంచి సిబ్బందిని కేటాయించాల్సి ఉంది. ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు అవసరమైన చట్టాన్ని తీసుకురావడం తదితర అంశాలపై ఇవాళ జరగనున్న క్యాబినెట్ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా పంచాయతీల ఏర్పాటుకు సంబంధించి డిమాండ్ పెరుగుతుండడంతో దానిపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి.
దేశానికే రోల్‌మోడల్‌గా స్కిల్ యూనివర్సిటీ - 150 ఎకరాల స్థలం రూ.100 కోట్లు కేటాయింపు : సీఎం - CM Revanth On Skill University
కొత్త రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ - అక్టోబరు 2 నుంచి దరఖాస్తుల స్వీకరణ - New Ration Cards issue oct 2nd