Telangana Cabinet Meeting 2024 : రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన కేబినెట్, కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో బ్యాంకుల నుంచి రైతులు తీసుకున్న పంట రుణాలను మాఫీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. 2023 డిసెంబర్ 09లోపు రైతులు తీసుకున్న రుణాలకు మాఫీ వర్తించనుంది.
ఆగస్టు 15 నాటికి రుణమాఫీ పూర్తి చేస్తామని గతంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించగా, ఇచ్చిన హామీ మేరకు అందుకు కావల్సిన నిధుల సమీకరణ తదితర అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. ఆ అంశాలను సీఎం రేవంత్‌రెడ్డి మీడియా వేదికగా వెల్లడించారు. 2022 మే 6న వరంగల్లో తమ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్‌లో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన గ్యారంటీని అమలు చేయడానికి మంత్రివర్గం సమావేశం నిర్వహించామన్నారు.
ఏక కాలంలో రూ.2 లక్షల రుణమాఫీ : ఇచ్చిన మాట ప్రకారం సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని, సోనియా మాట ఇస్తే శిలాశాసనమేనన్నారు. అదే తరహాలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని రాహుల్ హామీ ఇచ్చారని, అందుకే మంత్రివర్గం రుణమాఫీ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు ఉన్న రుణాలన్నీ ఏక కాలంలో మాఫీ చేస్తామని రేవంత్ తెలిపారు. ఇందుకోసం రూ.31 వేల కోట్లు అవసరమని అంచనా వేసినట్లు చెప్పారు.
"ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీకి మా మంత్రివర్గం పూర్తి స్థాయిలో విశ్లేషించి, చర్చించి, వివిధ బ్యాంకుల్లో ఉన్న రుణాలను సేకరించి వాటన్నింటినీ క్రోడీకరించి రైతు రుణమాఫీ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. తెలంగాణ నూతన రాష్ట్రం ఏర్పడ్డాక గత ప్రభుత్వం రెండు సార్లు రుణమాఫీ చేసింది. అనంతరం 2018 డిసెంబర్ 12 - డిసెంబర్ 9, 2023 మధ్య తీసుకున్న రుణాలకు మా ప్రభుత్వం సంపూర్ణ మాఫీ చేస్తుంది."-రేవంత్‌రెడ్డి, ముఖ్యమంత్రి