Telangana Cabinet Meeting 2024 :సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గ సమావేశం పూర్తి అయింది. కేబినెట్ భేటీ అనంతరం నిర్ణయాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు మీడియాకు వివరించారు. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, నాలాల్లో అక్రమ నిర్మాణాలును కూల్చివేసేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన హైడ్రాకు పూర్తి స్వేచ్ఛ ఉండేలా నిబంధనలు సడలించినట్లు తెలిపారు. హైడ్రాకు అవసరమైన సిబ్బందిని పలు విభాగాల నుంచి డిప్యుటేషన్‌పై రప్పిస్తున్నామని వెల్లడించారు. ఆ విభాగానికి 169 మంది అధికారులు, 964 మంది ఔట్సోర్సింగ్ సిబ్బందిని కేటాయిస్తున్నామని తెలిపారు.
ఈ ఖరీఫ్ నుంచి ఎంఎస్‌పీకి అదనంగా రూ.500 : కేబినెట్ భేటీ అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరాలు వెల్లడించారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులకు రూ.4637 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. రెండేళ్లలో పనులు పూర్తి చేయాలని ఏజెన్సీని ఆదేశించామని వెల్లడించారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పరిశీలించి ఇంజినీర్లు, ఏజెన్సీతో మాట్లాడామని వివరించారు. 2027 సెప్టెంబర్‌లోగా ఎస్‌ఎల్‌బీసీ, డిండి పనులు పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. ఈ ఖరీఫ్ నుంచి ఎంఎస్‌పీకి అదనంగా రూ.500 చెల్లించి సన్నాలు కొంటామని వెల్లడించారు.
"మిగతా శాఖలకు ఉండే స్చేచ్ఛ హైడ్రాకు వర్తిస్తుంది. హైడ్రాకు పూర్తి స్వేచ్ఛ ఉండేలా నిబంధనలు సడలించాం. ఆ విభాగానికి అవసరమైన సిబ్బందిని వివిధ విభాగాల నుంచి డిప్యుటేషన్‌పై రప్పిస్తున్నాం. మనోహరాబాద్‌లో 72 ఎకరాల్లో లాజిస్టిక్ పార్కు ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఖమ్మం జిల్లాలో 58 ఎకరాల్లో పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. వైద్య కళాశాలల్లో 3 వేలకు పైగా పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ ఇస్తాం. "- పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి