Telangana Assembly Sessions 2024 Extended : తెలంగాణ శాసనసభ సమావేశాలు మరో రెండు లేదా మూడు రోజులు పొడిగించే అవకాశం ఉంది. ఈ నెల 13 వరకు సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్ నిర్ణయం తీసుకున్నారు. అయితే మంగళవారం అసెంబ్లీ ఫ్లోర్ లీడర్లతో కలిసి మేడిగడ్డ సందర్శించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మేడిగడ్డ సందర్శన తర్వాత సాగునీటి శాఖపై శ్వేతపత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో మంగళవారం సభ జరిగే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు.
అదేవిధంగా ప్రాజెక్టుల నిర్వహణ కేంద్ర ప్రభుత్వానికి అప్పగించిందంటూ బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను గట్టిగా తిప్పికొట్టేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. ఇవాళ అసెంబ్లీ వేదికగాకృష్ణా జలాల ఒప్పందాలపై (Krishna Waters) పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఎల్ఈడీ స్క్రీన్లను రాత్రికి రాత్రే ఏర్పాటు చేసింది. మరోవైపు అసెంబ్లీలో పీపీటీ ఇచ్చే అవకాశం తమకూ ఇవ్వాలని బీఆర్ఎస్ కోరింది. ఇరిగేషన్ ప్రాజెక్టులపై వర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చే అవకాశం ఇవ్వాలని సభాపతిని ఇప్పటికే భారత్ రాష్ట్ర సమితి శాసనసభా పక్షం విజ్ఞప్తి చేసింది.
ఆరు గ్యారంటీలకే బడ్జెట్లో పెద్దపీట - మొత్తం ఎన్ని నిధులు కేటాయించారో తెలుసా?
అసెంబ్లీ సమావేశాల పొడిగింపుపై నిర్ణయం తీసుకోనున్న స్పీకర్ : ఈ నేపథ్యంలోనే ఇవాళ జరగాల్సిన బడ్జెట్‌పై చర్చ ఈ నెల 14న ఉండన్నుట్లు సమాచారం. ఈ నెల 15న నీటి పారుదల శాఖ అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అవసరమైతే అవసరాన్ని బట్టి ఇంకో రోజు కూడా పొడిగించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ విషయమై ఇవాళ శాసనసభ స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెబుతున్నారు.