Illegal Supplying PDS Rice to African Countries : రాష్ట్ర ప్రభుత్వం చౌక ధరల దుకాణాల ద్వారా పేదలకు ఉచితంగా సరఫరా చేస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. ఈ బియ్యం జిల్లా, రాష్ట్ర సరిహద్దులు దాటి ఏపీలోని కాకినాడ, విశాఖపట్నం ఓడరేవులకు చేరుతోంది. అక్కడి నుంచి ఆఫ్రికా దేశాలకు దర్జాగా నౌకల్లో రవాణా అవుతోంది. బియ్యం మాఫియాలో రేషన్ డీలర్లు మొదలు, అనేక మంది అక్రమ వ్యాపారులు, కొందరు మిల్లర్లు వాటా పంచుకుంటున్నారు. లబ్ధిదారులు చాలా మంది తమకు వస్తున్న ఉచిత బియ్యాన్ని రేషన్ డీలర్లకే ఇచ్చి కిలోకు రూ.5 చొప్పున తీసుకుంటున్నారు. ఇలా డీలర్లు పోగేసిన బియ్యాన్ని కొందరు అక్రమ వ్యాపారులు లారీల్లో ఓడరేవులకు తరలిస్తున్నారు.
ఖమ్మంలో ఓ వ్యాపారి, ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా వత్సవాయికి చెందిన మరో వ్యాపారి కలిసి ఉచిత బియ్యాన్ని సేకరించి లారీల్లో ఓడరేవులకు తరలిస్తూ కొన్నేళ్లుగా రూ.కోట్లు దండుకున్నట్లు తెలుస్తోంది. కొన్నాళ్ల క్రితమే ఈ ఇద్దరు ఆక్రమ వ్యాపారులు విడిపోయినట్లు సమాచారం. ఖమ్మంలో ఓ బియ్యం వ్యాపారి ఒక ప్రముఖ రేషన్ డీలర్‌తో కలిసి అక్రమ వ్యాపారం చేస్తున్నట్లు తెలిసింది. ఎన్టీఆర్ జిల్లా వత్సవాయికి చెందిన వ్యాపారి అధికారులకు ఉప్పందిస్తున్నట్లు ఖమ్మంలోని అక్రమార్కులు అనుమానిస్తున్నారు. ఇటీవలే బియ్యం లారీలు భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో పట్టుబడ్డాయి. దీంతో ఖమ్మంలోని వ్యాపారులు రూటు మార్చినట్లు తెలుస్తోంది.
ఖమ్మం జిల్లాల్లో 129 కేసులు నమోదు : ఉచితంగా ఇచ్చే దొడ్డు బియ్యాన్ని తినేవారు చాలా తక్కువగా ఉన్నారు. అందుకే రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. జిల్లాలో బియ్యం అక్రమ రవాణా, చౌకధరల దుకాణాల తనిఖీ ఘటనల్లో ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబరు వరకు పౌర సరఫరాల శాఖ అధికారులు 129 కేసులు నమోదు చేశారు. మొత్తం 2264.48 క్వింటాళ్ల చౌక బియ్యం స్వాధీనం చేసుకున్నారు. ఇందులో బియ్యం అక్రమ తరలింపు ఘటనల్లో 70 కేసులు నమోదయ్యాయి. రూ.54.98 లక్షల విలువైన 26 వాహనాలను, రూ.16.30 లక్షల విలువైన బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.