Telangana Budget 2023-24 Meets Expectations :గత ఆర్థిక సంవత్సరం ఆదాయ, వ్యయాలకు సంబంధించిన ప్రాథమిక గణాంకాలను రాష్ట్ర ప్రభుత్వం కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్)కు సమర్పించింది. మార్చి నెలాఖరుతో ముగిసిన 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఖజానాకు వచ్చిన మొత్తం, చేసిన ఖర్చు వివరాలను ప్రాథమికంగా అందులో పొందుపరిచింది. తుది వివరాలు వచ్చిన తర్వాత అందులో మార్పులు, చేర్పులు ఉండనున్నాయి.
Telangana Income 2024 Details :కాగ్‌కు ప్రభుత్వం ఇచ్చిన వివరాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ రాబడులు మొత్తం రూ.1,69,089 కోట్ల. బడ్జెట్లో అంచనా వేసిన రూ.2,16,566 కోట్లలో ఇది 78 శాతానికి పైగా ఉంది. 2023-24లో 1,52,499 కోట్లు పన్నుల ద్వారా వస్తాయని అంచనా వేయగా అందులో దాదాపు 89 శాతం మేర అంటే 1,35,540 కోట్లు సమకూరాయి. జీఎస్టీ ద్వారా రూ.46,500 కోట్లు, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు ద్వారా రూ.14,295 కోట్లు, అమ్మకం పన్ను ద్వారా రూ.29,989 కోట్లు ఖజానాకు చేరాయి.
ఓఆర్ఆర్ టోల్ ట్యాక్స్ కారణంగా భారీగా పన్నేతర ఆదాయం : ఎక్సైజ్ పన్నుల రూపంలో రూ.20,298 కోట్లు, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాగా రూ.16,536 కోట్లు, ఇతర పన్నుల రూపంలో రూ.7,918 కోట్లు సమకూరాయి. ఎక్సైజ్ పన్నులు, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా లక్ష్యాన్ని అధిగమించింది. జీఎస్టీ అంచనాలను 91 శాతానికిపైగా అందుకొంది. స్టాంపులు-రిజిస్ట్రేషన్లు, అమ్మకం పన్ను అంచనాల్లో 70 శాతాన్ని చేరుకొన్నాయి. పన్నేతర ఆదాయం రూ.22,808 కోట్లు వస్తాయని బడ్జెట్లో అంచనా వేశారు. కానీ లక్ష్యాన్ని అధిగమించి రూ.23,819 కోట్లు ఖజానాకు చేరాయి. ఔటర్ రింగ్ రోడ్ టోల్ ట్యాక్స్ లీజు మొత్తం కారణంగా పన్నేతర ఆదాయం భారీగా వచ్చింది.
కేంద్రం నుంచి గ్రాంట్ల విషయంలో మాత్రం అంచనాలు భారీగా తప్పాయి. గ్రాంట్ల రూపంలో భారీగా రూ.41,259 కోట్లు వస్తాయని అంచనా వేయగా, ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి అందులో కేవలం 23.58 శాతం అంటే రూ.9,729 కోట్లు మాత్రమే రాష్ట్రానికి వచ్చాయి. 2023-24లో రాష్ట్ర ప్రభుత్వం రూ.49,440 కోట్లు అప్పుగా తీసుకొంది. ఇది బడ్జెట్ అంచనా అయిన రూ.38,234 కోట్లలో 129 శాతంగా ఉంది. ఖజానాకు అన్ని రకాలుగా చేరిన మొత్తం రూ.2,18,566 కోట్లు. ఇది బడ్జెట్లో పేర్కొన్న రూ.2,59,861 కోట్లలో 84 శాతానికి పైగా ఉంది.
ఇంక ఖర్చు విషయానికి వస్తే : గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన మొత్తం వ్యయం రూ.2,11,705 కోట్లు. బడ్జెట్లో అంచనా వేసిన రూ.2,49,209 కోట్లలో 85 శాతంగా ఉంది. సర్కార్ చేసిన ఖర్చులో రెవెన్యూ వ్యయం రూ.1,67,452 కోట్లు కాగా మూలధన వ్యయం రూ.44,252 కోట్లు. వడ్డీ చెల్లింపుల కోసం ప్రభుత్వం రూ.23,337 కోట్లు ఖర్చు చేయగా, వేతనాల కోసం రూ.38,911 కోట్ల వ్యయం చేసింది. పెన్షన్లకు రూ.16,841 కోట్లు, రాయితీలపై రూ.9,410 కోట్లు ఖర్చు చేసింది.