Teacher Sexual Harassment : విద్యార్థులకు తరగతి గదిలో చదువు చెప్పి వారిని ఉన్నత స్థానంలో నిలపుతారని టీచర్లపై సమాజంలో ఉన్న ఓ నమ్మకం. తాను నేర్పిన విద్యతో విద్యార్థులు ఎవరైనా జీవితంలో మంచి ఉన్నత స్థానంలో స్థిరపడితే ఎక్కువగా సంతోషించేది కూడా గురువే. పిల్లలను మంచిదారిలో నడిపించాల్సిన ఓ గురువు దారి తప్పాడు. తరగతి గదిలో విద్యార్థునులతో అసభ్యకరంగా ప్రవర్తించిన తీరు సంచలనం అయ్యింది.
మొదటగా చితకబాది : ఉపాధ్యాయుడి వ్యవహారం వెలుగులోకి రావడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి అతనికి అక్కడే దేహశుద్ధి చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండలం సక్రం నాయక్ తండాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చోటు చేసుకుంది. పాఠశాలలో ఉపాధ్యాయుడు విద్యార్థినులకు తన మొబైల్ ఫోన్లో నీలి చిత్రాలు (బ్లూ ఫిల్మ్స్) చూపించాడు. తమతో అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతో తట్టుకోలేని ఆ విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని వివరించారు.
డీఈవోకి ఫిర్యాదు : వెంటనే పాఠశాలకు చేరుకున్న తల్లిదండ్రులు ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసి, అతని వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలకు చదువు నేర్పించమని పంపిస్తే నువ్వు చేసే పనులివా అంటూ నిలదీశారు. ఉపాధ్యాయుడి వ్యవహారాన్ని తక్షణమే జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. అవసరమైతే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలని తెలిపారు. బాధితులంతా గిరిజన విద్యార్థినులు కావడం గమనార్హం.