TDP Workshop: తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికల్లో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని నేతలు ధీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య విలువలు తెలియని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో విజయవాడలోని ఎ కన్వెన్షన్‌లో చంద్రబాబు వర్క్‌షాప్ నిర్వహించారు. అభ్యర్థులతో పాటు ఇతర నియోజకవర్గ ఇన్‌ఛార్జులు హాజరయ్యారు.
అదే విధంగా జనసేన, బీజేపీ ప్రతినిధులు సైతం ఈ వర్క్‌షాప్‌కు హాజరయ్యారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి, అభ్యర్థుల హక్కులు, వైసీపీ కుట్రలపై ఈ కార్యక్రమంలో చర్చించారు. ఎన్నికల్లో ప్రచారం, నామినేషన్ల దాఖలు వంటి అంశాలపైనా చర్చ జరిగింది. అభ్యర్థులు అనుసరించాల్సిన పద్ధతులు, వ్యూహాలను నేతలకు చంద్రబాబు వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
అయిదు కోట్ల ఆంధ్రుల కోసమే పొత్తు:ఎన్ని ఇబ్బందులు సృష్టించినా కష్టపడి నిలదొక్కుకున్నాం కాబట్టే మళ్లీ అధికారంలోకి వస్తున్నామని అచ్చెన్నాయుడు అన్నారు. పొత్తులు 5 కోట్ల ఆంధ్రుల కోసమే అని గుర్తించి ప్రతీ ఒక్కరూ సహకరించాలని కోరారు. తమపై ఎన్ని కేసులు ఉన్నాయో చెప్పండి అని పోలీసుల్ని అభ్యర్థులు ఆశ్రయించే దౌర్భాగ్య స్థితి నెలకొందని విమర్శించారు. విశాఖను రాజధాని అని చెప్పి డ్రగ్స్ కేంద్రంగా జగన్ గ్యాంగ్ మార్చేసిందని మండిపడ్డారు. డ్రగ్స్ రవాణాలో అడ్డంగా దొరికిపోయి తెలుగుదేశంపై నిందలు మోపటం సిగ్గుచేటని అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నేతలు కలిసికట్టుగా పనిచేస్తే వైసీపీకి సింగల్ డిజిట్‌యే వస్తుందని అచ్చెన్నాయుడు జోస్యం చెప్పారు.