TDP Leaders Rammohan and Bharath Zoom Call to Kyrgyzstan Students :కిర్గిజ్‌స్థాన్ రాజధాని బిష్కెక్‌లో గత మూడు రోజులుగా విదేశీ విద్యార్థులపైన దాడులు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థుల బాగోగులు తెలుసుకోవడానికి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, విశాఖపట్నం తెలుగుదేశం పార్లమెంటరీ ఇంఛార్జి శ్రీ భరత్, తెలుగు యువత జనరల్ సెక్రటరీ నాగ శ్రవణ్ కిలారులు బిష్కెక్‌లో ఉన్న విద్యార్ధులతో జూమ్ కాల్లో పాల్గొని వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ధైర్యంగా, సహనంతో అప్రమత్తంగా ఉండాలని, భారత దేశ ఎంబసీకి ఎప్పటికప్పుడు తమ సమాచారం ఇవ్వాలి అని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
పూర్తి సహాయ సహకారాలు అందేవరకు కృషి : దేశ విదేశాంగ శాఖ నుండి పూర్తి సహాయ సహకారాలు వచ్చేవరకూ నిరంతరం కృషి చేస్తామని ఆయన విద్యార్థులకు ధైర్యం చెప్పారు. విద్యార్థులు అత్యవసరానికి తప్పితే బయటకు రాకుండా జాగ్రత్త పడాలని భరత్ సూచించారు. భారత విదేశాంగ శాఖ ద్వారా వారికి అన్ని సహకారాలు అందించే విధంగా తెలుగుదేశం పార్టీ ద్వారా భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామని, విద్యార్ధులు మనో ధైర్యంతో ఉండాలని కోరారు.
భారత్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ విద్యార్థులపై దాడులు :అయితే కిర్గిజ్‌స్థాన్ రాజధాని బిష్కెక్‌లో గత రెండు రోజులుగా భారత్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ విద్యార్థులు ఉంటున్న హాస్టళ్లపై దాడులు జరుగుతున్నాయి. ఈ గొడవలకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో వైద్య విద్యకు ఏపీ నుంచి కిర్గిజ్‌స్థాన్ వెళ్లిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. స్థానికులకు, ఈజిప్ట్ విద్యార్థులకు మధ్య జరిగిన ఘర్షణ తర్వాత అల్లరి మూకలు విదేశీ విద్యార్థులపై దాడులు చేయడం ప్రారంభించాయి.