TDP Leaders Criticized to YCP Manifesto :వైసీపీ మేనిఫెస్టోపై టీడీపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ఎప్పుడు ఆడే అబద్దాలనే జగన్ రెడ్డి మళ్లీ తమ మేనిఫెస్టోలో వల్లించారని దుయ్యబట్టారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ అశోక్ బాబు మీడియాతో మాట్లాడుతూ, గతంలోలానే రెండు పేజీల మేనిఫెస్టోను ప్రకటించిన జగన్ కొత్తగా చెప్పుకోదగిన హామీలేవీ ఇవ్వలేదని తెలిపారు. కేవలం రెండు మూడు పథకాల్లో ఇచ్చే నగదును స్వల్పంగా పెంచి మమ అనిపించారని మండిపడ్డారు. కీలకమైన పారిశ్రామిక అభివృద్ధి, యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పన సహా ఉద్యోగులకు పీఆర్సీ తదితర అంశాలపైనా మేనిఫెస్టోలో హామీ ఇవ్వలేదని విమర్శించారు.
పాత మేనిఫెస్టోకు కొత్త రంగులద్దిన వైఎస్సార్సీపీ- డ్వాక్రా, రైతు రుణాల మాఫీ ఊసేదీ!
కొత్త సీసాలో పాత సారాలా వైసీపీ మేనిఫెస్టో : అలాగే జగన్ మేనిఫెస్టోతో అవ్వాతాతలకు షాకిచ్చాడన్నారు. ఉపాధి, ఉద్యోగాల జాడ లేదని ఆక్షేపించారు. మద్య నిషేధం ఊసేలేదన్నారు. అసలు వైసీపీ మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా అనే మాటే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరంతో పాటు సాగునీటి ప్రాజెక్టులను జగన్ రెడ్డి పక్కన పెట్టడని ఆరోపించారు. అమ్మ ఒడి పథకంలో మరో రెండు వేలు పెంచి ఒక బిడ్డకే ఇస్తానంటూ అమ్మలకు జగన్ షాక్ ఇచ్చాడని మండిపడ్డారు. ఎంత మంది బిడ్డలు ఉంటే అందరికి చంద్రబాబు తల్లికి వందనం ఇస్తానన్నారని అశోక్ బాబు గుర్తుచేశారు.
జగన్ మేనిఫెస్టోతో అన్నదాతలకు షాక్ :రైతులకు కూడా వైసీపీ మేనిఫెస్టోతో నిరాశేనని తెలిపారు. కేంద్రం ఇచ్చే నిధులతో కలిపి 16వేల రూపాయలు మాత్రమే ఇస్తామంటూ ప్రకటించడని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలుగుదేశం మేనిఫెస్టో ప్రకారం అన్నదాత పథకం ద్వారా రైతుకు ఏడాదికి 20 వేల రూపాయలు లబ్ధిచేకురుతుందని స్పష్టంచేశారు. టీడీపీ సూపర్ సిక్స్ పథకాల ముందు వైసీపీ మేనిఫెస్టో తేలిపోయిందన్నారు. మేనిఫెస్టోను చూసిన వైసీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందని అశోక్ బాబు పేర్కొన్నారు.