TDP JANASENA BJP MANIFESTO: రాష్ట్ర ప్రజల నేటి అవసరాలు తీరుస్తాం, రేపటి ఆకాంక్షలను సాకారం చేస్తాం అనే నినాదంతో తెలుగుదేశం - జనసేన - బీజేపీ కూటమి తమ ఉమ్మడి మేనిఫెస్టోను మంగళవారం విడుదల చేయనున్నాయి. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేసే ఈ మేనిఫెస్టో కార్యక్రమంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లతో పాటు బీజేపీ ముఖ్య నేతలు పాల్గొంటారు.
స్పష్టమైన రోడ్ మ్యాప్‌తో: పన్ను బాదుడు లేని సంక్షేమం, ప్రతి ప్రాంతంలో అభివృద్ది లక్ష్యంతో ఈ మేనిఫెస్టో రూపొందించినట్లు సమాచారం. అప్పులు, పన్నులతో ఇచ్చేది సంక్షేమం కాదని, సంపద సృష్టితో సంక్షేమం ఇస్తామనే హామీని మేనిఫెస్టో ద్వారా కూటమి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వచ్చే 5 ఏళ్లలో చేసే అభివృద్ధిపై స్పష్టమైన రోడ్ మ్యాప్‌తో దీనిని రూపొందించారు.
2023 రాజమండ్రి మహానాడులో సూపర్ సిక్స్ పథకాలు ఇప్పటికే మినీ మేనిఫెస్టో రూపంలో ప్రకటించిన తెలుగుదేశం, వాటిని విస్తృతంగా ప్రచారం చేస్తోంది. షణ్ముఖ వ్యూహం పేరుతో జనసేన సైతం పలు పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లింది. మూడు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలో దిగినందున, ఉమ్మడిగా పూర్తి స్థాయి మేనిఫెస్టోను ప్రకటించేందుకు రేపు ముహూర్తం ఖరారు చేసుకున్నాయి.