Statewide Cockfighting Competitions : సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. కోడి పందేలు చూసేందుకు బరుల వద్దకు ప్రజలు భారీగా తరలి వస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలో కోడి పందేలు తిలకిస్తూ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని సందడి చేశారు. విజయవాడ, కృష్ణా జిల్లాలో పెద్ద ఎత్తున కోడి పందేల బరులు వెలిశాయి. విజయవాడ నగర శివారులోని రామవరప్పాడు, నున్న, గన్నవరం, అంపాపురం తదితర ప్రాంతాల్లో బరులు ఏర్పాటు చేశారు. కోడి పందేలు రూ.లక్షల్లో జరుగుతన్నాయి. బరుల్లో పందేల గురించి బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నారు.
పందెం రాయుళ్లు కత్తులు కట్టి కోడి పుంజులను బరిలోకి వదులుతున్నారు. నగదు తీసుకురాని వారి కోసం బరుల నిర్వాహకులు స్పాట్ క్యాష్ సౌలభ్యం ఏర్పాటు చేశారు. పందేలను వీక్షించేందుకు గ్యాలరీలు సైతం ఏర్పాటు చేశారు. నగర శివారులో రామవరప్పాడు, నున్న గన్నవరం, కొత్తూరు తాడేపల్లి, పాముల కాలువ ప్రాంతాల్లో కోడి పందేలు హోరా హోరిగా సాగుతున్నాయి. బరుల వద్దే మద్యం విక్రయాలు చేస్తున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
నందిగామలో కోడిపందాల బరులు వద్దని పేకాటతో పాటు ఇతర జుదాలు భారీగా నిర్వహిస్తున్న పోలీసులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. నందిగామలో మూడు చోట్ల, చందర్లపాడులో ఒక చోట కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి.
ఆత్రేయపురంలో సంక్రాంతి సంబరాలు - ఉత్సాహంగా పడవ పోటీలు
ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. నందిగామ, చందర్లపాడులో ఈ పోటీలు సాగుతున్నాయి. కంచికచర్ల మండలం గండేపల్లి వద్ద టెంట్లు ఏర్పాటు చేసి భారీ ఎత్తున పందేలు నిర్వహిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెదఅమిరంలో కోడి పందేలను డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు ప్రారంభించారు.
చాలాచోట్ల కోడిపందేలతో పాటు క్యాసినో తరహాలో జూదక్రీడలు నిర్వహించేందుకు ఏర్పాట్లు గుట్టుచప్పుడు కాకుండా చేస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లో క్యాసినో ఆడేందుకు అనుమతించమని పోలీసులు వీటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినా నిర్వాహకులు తమ పనికానిచ్చేస్తున్నారు. కొన్నిచోట్ల రెవెన్యూ, పోలీసు అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నాయి. జూద శిబిరాలకు ప్రవేశ రుసుం రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు నిర్ణయించినట్లు తెలిసింది. అన్నిచోట్లా విచ్చలవిడిగా గొలుసు దుకాణాలు ఏర్పాటు చేశారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కోడిపందాల్లో కరెన్సీ కట్టలు చేతులు మారుతున్నాయి. ఎగువన ఉన్న పోలవరం నియోజకవర్గం నుంచి దిగువన ఉన్న నరసాపురం నియోజకవర్గం వరకూ కోడి పందేలు జోరుగా సాగుతున్నయి, కాళ్ల మండలం సీసలి, పెదఅమిరం, ఐ.భీమవరం, ఆకివీడు, మహదేవపట్నంతోపాటు ఏలూరు జిల్లా దుగ్గిరాలలోని పెద్ద బరుల్లో జనసందోహం ఎక్కువగా ఉంది. కొన్నిచోట్ల పందెంలో గెలిచిన వారికి ద్విచక్రవాహనాలు బహుమతిగా అందిస్తున్నారు. కోడి పందేలతోపాటు గుండాటలు జోరుగా నిర్వహిస్తున్నారు.