Bull Competitions Going on Grandly in Nellore District : సంక్రాంతి అంటేనే సంబరాలు. మరీ ముఖ్యంగా ఈ పండగ సందర్బంగా పాడి పశువులకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఎడ్లను ముస్తాబు చేయడమే గాకుండా వాటికి అనేక రకాల పోటీలు నిర్వహిస్తుంటారు. ఈ పోటీలకు ఎద్దులకు ప్రత్యేక తర్ఫీదు ఇస్తుంటారు. ఈ పోటీలు చూసేందుకు భారీ ఎత్తున ప్రజలు తరలి వస్తుంటారు.
నెల్లూరు జిల్లా కోవూరులో రాష్ట్ర స్థాయి ఎడ్ల పరుగు పందేలు నిర్వహించారు. కోవూరు రైతు సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో పోటీలను నిర్వహించారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి 40 జతల ఎడ్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. పోటీలను తిలకించేందుకు వచ్చిన ప్రజలతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ఏటా ఈ పోటీలను కోలాహలంగా జరుగుతాయి. నాలుగు కిలోమీటర్ల దూరం తక్కువ సమయంలో వెళ్లి వచ్చే ఎడ్లను విజేతగా ప్రకటించి నిర్వాహకులు బహుమతులు అందజేశారు. ఎడ్ల పోటీలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలతో కొత్తూరు ప్రాంతం కిక్కిరిసింది.
ఆత్రేయపురంలో సంక్రాంతి సంబరాలు - ఉత్సాహంగా పడవ పోటీలు
గత 38 సంవత్సరాలుగా రైతు సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఎద్దుల పరుగు ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మన సంస్కృతి, సాంప్రదాయాలను నిలబెట్టుకోవడానికి అన్నదాతలు అంతా కలిసి ప్రతిష్ఠాత్మకంగా ఈ వేడుకను చేస్తామని రైతులు తెలుపుతున్నారు. ఎటువంటి రాజకీయాలు లేకుండా విజేతలను ఎంపిక చేసి బహుమతులు అందిస్తామని సమన్వయకర్తలు తెలుపుతున్నారు.
బండలాగుడు పోటీలు: సంక్రాంతి సంబరాల్లో భాగంగా బాపట్ల జిల్లా పర్చూరు మండలం అన్నంబొట్లవారిపాలెంలో జాతీయస్థాయి ఒంగోలు ఎడ్ల బల ప్రదర్శన పోటీలు ఉత్కంఠభరితంగా జరుగుతున్నాయి. గోరంట్ల రత్తయ్య చౌదరి ప్రాంగణంలో 37వ జాతీయస్థాయి ఒంగోలు జాతి గిత్తల బల ప్రదర్శన పోటీలు నిర్వహించారు. 15 క్వింటాళ్ల బండను 20 నిమిషాల వ్యవధిలో ఎక్కువ దూరం లాగిన జతను విజేతగా ప్రకటిస్తారు.
పోటీలో 9 ఎడ్ల జతలు పాల్గొన్నాయి. గెలుపొందిన ఎడ్ల జతలకు మొదటి బహుమతి 50,116, రెండవ బహుమతి 40,116, మూడవ బహుమతి 30,116 ఇస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు . ప్రతి విభాగంలో 9 బహుమతులు ఉంటాయని నిర్వాహకులు చెప్పారు. ప్రేక్షకుల కేరింతల మధ్య క్రీడా ప్రాంగణం హోరెత్తింది.