Grand Welcome TO AP CM Chandrababu :ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి హైదరాబాద్‌కు వచ్చిన చంద్రబాబుకు, తెలుగుదేశం శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. దిల్లీలో రెండు రోజుల పర్యటన ముగించుకొని, బేగంపేట విమానాశ్రయానికి వచ్చిన చంద్రబాబును తొలుత గజమాలతో సత్కరించారు. అనంతరం బేగంపేట నుంచి జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం వరకు ర్యాలీ చేపట్టారు. సన్‌రూఫ్ కారు నుంచి చంద్రబాబు పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.
సాయంత్రం సుమారు 4 గంటల నుంచే ఎయిర్ పోర్ట్‌కు భారీగా చేరుకున్న అభిమానులు, పార్టీ శ్రేణులతో బేగంపేట పరిసరాలు పసుపు రంగు అద్దుకున్నాయి. రాత్రి ఏడు గంటలకు బేగంపేట విమానాశ్రాయానికి వచ్చిన బాబుకి పార్టీ నేతలు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. అనంతరం ద్విచక్ర వాహనాలు, కార్లతో భారీగా ర్యాలీ చేపట్టారు. బేగంపేటలో జోరు వాన కురుస్తున్నా లెక్కచేయని కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. జూబ్లిహిల్స్‌లోని, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు బాబు చేరుకోగానే భారీగా బాణాసంచా కాల్చీ స్వాగతం పలికారు. దారి పొడవునా తెలుగుదేశం కార్యకర్తలు, చంద్రబాబు అభిమానులు సైతం పెద్ద సంఖ్యలో వేచి ఉండి స్వాగతం పలికారు. చంద్రబాబు రాక సందర్భంగా, పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
Telugu States CMs Meeting : తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కీలక భేటీ శనివారం జరగనుంది. విభజన అంశాల వివాదాల పరిష్కారమే లక్ష్యంగా, సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్ వేదికగా రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. సుమారు రెండు గంటలు జరిగే సమావేశానికి, పది ప్రధాన అంశాలతో ఎజెండా సిద్ధం చేశారు. తొమ్మిది, పదో షెడ్యూలులోని సంస్థల పంపిణీతో పాటు విద్యుత్ బకాయిలు, ఉద్యోగుల విభజన వంటి చిక్కుముళ్లపై సమాలోచనలు చేయనున్నారు.