Tadipatri Municipal Chairman JC Prabhakar Reddy Fire On YSRCP Leaders :బస్సుల కొనుగోలు విషయంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం తమను దొంగలుగా చిత్రీకరించి జైలుకు పంపారని మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఐపీఎస్ సీతారామాంజనేయులు, అప్పటి మంత్రి పేర్ని నాని, డీటీసీ శివరాం ప్రసాద్ ఆదేశాలతో వేధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పది రోజుల్లో అధికారులు తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఎస్పీ కార్యాలయం, డీటీసీ ఆఫీస్ ముందు తాను, తన కుటుంబ సభ్యులు నిరాహార దీక్ష చేస్తామని జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. ఇది తన వ్యక్తిగత విషయమని సీఎం నారా చంద్రబాబు నాయుడు, ప్రభుత్వానికి సంబంధించినది కాదని స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందంటే అవసరమైతే పార్టీకి రాజీనామా చేస్తానని తెలిపారు.
జగన్ పాలనలో పరిశ్రమలు మూతపడి కార్మికులు వీధినపడ్డారు: జేసీ ప్రభాకర్ రెడ్డి
తమపై తప్పుడు కేసులు పెట్టి దొంగలుగా చూపించిన ఏ అధికారిని వదిలి పెట్టేదిలేదని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. అనంతపురంలో మీడియా సమావేశం నిర్వహించిన జేసీ ప్రభాకర్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్లుగా అప్పటి మంత్రి పేర్ని నాని, జిల్లా ట్రాన్స్ ఫోర్ట్ అధికారి శివరాంప్రసాద్‌లు తమపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారని అన్నారు. తనపై పెట్టిన కేసులు నిరూపించాలని, లేకపోతే హైకోర్టు ఆదేశించినట్లుగా రూట్ బస్సులు శిధిలమైనందున పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
తన కుటుంబంలోని అందిరిపై కేసులు పెట్టించిన సజ్జల రామకృష్ణారెడ్డికి ఏ గతిపట్టిందో, తాను అందరికీ అదే గతి పట్టిస్తానని ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. తమను దొంగలుగా తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపిన ఏ ఒక్కరినీ వదలనని జేసీ కన్నీటి పర్యంతమయ్యారు. తమ కుటుంబంలో అందరిపై తప్పుడు కేసులతో ఇబ్బందులకు గురి చేసిన ఆర్టీఏ అధికారులను ఉద్యోగాలు ఊడగొట్టేవరకు పోరాటం చేస్తానని అన్నారు. బీఎస్-3 వాహనాలు విక్రయించరాదని దేశవ్యాప్తంగా ఆదేశాలుంటే, అశోక్ లైలాండ్ కంపెనీ వాహనాలను ఏ విధంగా విక్రయించిందని, ఆర్టీఏ అధికారులు రిజిస్ట్రేషన్ ఎలా చేశారని జేసీ ప్రశ్నించారు.
అధికార పార్టీ వాహనాలు నంబరు ప్లేట్ లేకుండా తిరుగుతున్నా పట్టించుకోరా ! - జేసీ ప్రభాకర్ ఆందోళన
అన్నీ సక్రమంగా ఉన్న బస్సులపై కూడా అక్రమ కేసులు పెట్టి రూట్ బస్సులను సీజ్ చేసి తనకు తీవ్ర ఆర్థిక నష్టం చేశారని ఆర్టీఏ అధికారులపై ఆరోపణలు చేశారు. రూట్ బస్సులో ఫస్ట్ ఎయిడ్ కిట్ లేదని ఆర్టీఏ మహిళ అధికారి బస్సును సీజ్ చేశారని, ఇలాంటి సంఘటనలు దేశంలో ఎక్కడా ఉండవని ఆయన అన్నారు. ఆర్టీఏ శాఖ ఉన్నతాధికారులైన పీఎస్ ఆర్ ఆంజనేయులు, ఇతర ఐఏఎస్ అధికారులపై జేసీ మండిపడ్డారు. సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్లుగా పనిచేసిన ఐఏఎస్ , ఐపీఎస్ అధికారులది మీదీ ఓ బతుకేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు కేసులు పెట్టొద్దని ఆర్టీఏ అధికారులను తాను చేతులెత్తి వేడుకున్నా ఖాతరు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు కేసులు పెట్టించిన అప్పటి మంత్రి పేర్ని నానిపై జేసీ ప్రభాకర్ రెడ్డి నిప్పులు చెరిగారు.
జగన్మోహన్ రెడ్డి అసమర్థ పరిపాలన కారణంగానే రైతుల ఆత్మహత్యలు: జేసీ ప్రభాకర్ రెడ్డి