Biryani ordered in Hyderabad : ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్‌తో బయటకు వెళ్లినా, ఏ పార్టీ చేసుకున్నా బిర్యానీ మాత్రం ఉండాల్సిదే ఈరోజుల్లో. ఎన్ని వంటకాలు వచ్చినా బిర్యానీకి నాటికీ, నేటికీ ఆదరణ మాత్రం అస్సలు తగ్గలే. నగరంలో బిర్యానీ ఏ రేంజ్లో ఉందంటే ఈ ఏడాదిలో ఏకంగా 1.57 కోట్ల ప్లేట్ల బిర్యానీలను ఆరగించారు. దీని ప్రకారం నిమిషానికి 34 బిర్యానీలను ఆర్డర్ చేస్తున్నారు. ఇది దేశంలోనే అత్యధికం. కేవలం మధ్యాహ్నం, రాత్రి మాత్రమే కాదండోయ్.. తెల్లవారుజామున 4 గంటలకు కూడా బిర్యానీ ఆర్డర్ చేస్తున్న వారు కూడా ఉన్నారు. మంగళవారం హైదరాబాద్‌కు సంబంధించి ఏడాదిపాటు బిర్యానీ ఆర్డర్లను స్విగ్గి సంస్థ వెల్లడించింది.
నగరంలో 17.54 లక్షల దోశలు ఆర్డర్లు : స్విగ్గి సంస్థ ఆర్డర్లే అలా ఉంటే మిగతా సంస్థలవి, రెస్టారెంట్ల్లోని వేడుకల్లో ఆరగించే విందులను కలిపితే బిర్యానీల సంఖ్య భారీగానే ఉంటుంది. ఎక్కువమంది చికెన్ బిర్యానీనే తింటున్నారు. ఒక వ్యక్తి అయితే ఏడాదిలో 60 బిర్యానీల కోసం ఏకంగా రూ.18,840 వెచ్చించారు. క్రికెట్ చూస్తూ బిర్యానీ తింటే ఆ మజానే వేరట. అందుకే టీ20 ప్రపంచకప్ జరిగిన సమయంలో సుమారు 8.69 లక్షల ఆర్డర్లు ఇచ్చారు. మధ్యాహ్నం, రాత్రి బిర్యానీ ఆరగిస్తే ఉదయం ఎక్కువగా దోశనే ఆర్డర్ చేస్తున్నారు. ఈ జాబితాలో దేశంలోనే హైదరాబాద్ మొదటిస్థానాన్ని కైవసం చేసుకుంది. దాదాపు 17.54 లక్షల దోశలు ఆర్డర్లు వచ్చాయి.