Suresh Organic Farmer from Nalgonda :ప్రకృతిని మనం కాపాడితే, అది మనల్ని కాపాడుతుందనే ప్రాథమిక సూత్రాన్ని బలంగా విశ్వసించాడా యువకుడు. చిన్నప్పటి నుంచి ప్రకృతితో కలిసి తిరిగిన ఆ యవకుడికి, ప్రకృతిలో సంభవిస్తున్న వైపరీత్యాలు అతన్ని లోతుగా ఆలోచింపచేశాయి. ఖాళీ స్థలాల్లో మెుక్కలు నాటి హరితహారాన్ని సృష్టించాలనుకున్నాడు. ఒకవైపు సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తూ, మరో వైపు వేల సంఖ్యలో మెుక్కలు నాటుతున్నాడు.
మొక్కలను పెంచండి. పర్యావరణాన్ని పరిరక్షించండి అనే మాటలు తరచూ వింటూనే ఉంటాం, కానీ వాటిని కొంతమందే ఆచరణలో పెడతారు. పర్యావరణ పరిరక్షణ కోసం అడుగులు వేస్తున్న ఈ యువకుడి పేరు సురేశ్. సూర్యాపేట జిల్లా అడ్డగూడూరుకి చెందిన వీరస్వామి-నాగమ్మ దంపతులు చిన్న కుమారుడు. డిగ్రీ వరకు చదువుకున్న సురేశ్‌కి చిన్నప్పటి నుంచి పల్లె గాలి పచ్చని పైరు, ఆహ్లాదమైన వాతావరణం అంటే ఎంతో ఇష్టం.
రానురాను అత్యధిక ఉష్ణోగ్రతలు, భూకంపాలు ఇలా ప్రకృతిలో సంభవిస్తున్న వైపరీత్యాలని చూసి పర్యావరణ పరిరక్షణకు తన వంతు కృషి చేయాలనుకున్నాడు. పై చదువులకు స్వస్తి చెప్పి సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తూ, మొక్కలు పెంచాలనే ఆలోచనకు శ్రీకారం చుట్టాడు. స్నేహితులు, ఇంటి పక్కన చిన్నారులతో కలిసి రోడ్డుపై పడేసిన ప్లాస్టిక్‌ని సేకరించి, వాటిలో మెుక్కలు పెంచటం ప్రారంభించాడు.
వాటి కోసం ఎర్రమట్టి, ఇంటి వద్ద లభించే చింత, నిమ్మ, వేపతోపాటు గ్రామాల్లో పెరిగే వివిధ రకాల చెట్ల గింజలను సేకరించి మెుక్కలు తయారీలో ఉపయోగిస్తున్నారు. అలా పెరిగిన మెుక్కలను ఖాళీ ప్రదేశాలు, గుట్ట ప్రాంతాల్లో నాటుతున్నాడు. ఇలా గత ఐదేళ్లగా మెుక్కలు పెంచుతూ, పర్యావరణ పరిరక్షణకు తన వద్దు కృషి చేస్తున్నాడు. పాఠశాల సమయం నుంచి పర్యావరణ పరిరక్షణకు తన వంతు కృషి చేయాలని సురేశ్ అనుకునేవాడు.
ప్రస్తుతం పండించే పంటలలో అధిక శాతం కెమికల్స్ వాడుతున్నారు. దానిని నివారించాలని సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయటం ప్రారంభించాడు సురేశ్. దానితో పాటు పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు పెంచాలని భావించాడు. దాని కోసం సామాజిక మాధ్యమాలని వేదికగా చేసుకున్నాడు. తనతో పాటు పలువురికి అవగాహన కల్పించాలని యూ ట్యూబ్‌లో మెుక్కలు నాటే వీడియోలను పోస్టు చేస్తున్నాడు సురేశ్.
ప్రతిరోజు దినచర్యలా ఉదయాన్నే సురేశ్ గ్రామంలో పర్యటిస్తాడు. రోడ్డుపైన పడేసిన వాటర్ బాటిల్స్.. ప్లాస్టిక్ సంచులను సేకరిస్తాడు. వాటిని పాత ఇనుపసామాన్ల కోట్టులో ఇచ్చేవాడు. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్‌ను సగానికి కోసి వాటిలో.. ఇళ్ల దగ్గర లభించే మామిడి, చింత, నిమ్మ, రేగు, ఈత, వేపతోపాటు వివిధ రకాల చెట్ల గింజలు, విత్తనాలను వేసి ఎర్రమట్టితో నింపేవాడు. మొక్కలు వచ్చిన తర్వాత వాటిని తీసుకువెళ్లి ఖాళీ ప్రదేశాలు, గుట్ట ప్రాంతాల్లో మెుక్కలు నాటుతున్నాడు.
సురేశ్ ఫార్మర్ పేరుతో యూట్యూబ్ ప్రారంభించి అందులో సేంద్రియ వ్యవసాయం.. అందులో మెళకువలు.. మెుక్కలు పెంచటం.. పర్యావరణ పరిరక్షణ కృషి చేయాలని యువతకి అవగాహన కల్పిస్తున్నాడు. సామాజిక మాధ్యమంలో మంచి స్పందన వచ్చిందని సురేశ్ చెబుతున్నాడు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని.. మెుక్కలు పెంచాలని మెుదట్లో సురేశ్ చెబితే పట్టించుకోలేదని.. తర్వాత తమకు అర్థమైందని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఏడాదిలో ప్రతి ఒక్కరూ కనీసం ఐదు మెుక్కలైన నాటాలని చెబుతున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని.. మెుక్కలు పెంచాలని సురేశ్ కోరుతున్నాడు.
YUVA - చేపలపై యువ పరిశోధకుడి రీసెర్చ్ - వరల్డ్ జర్నల్స్‌లో కథనాలు - Young Man Research on Fishes
YUVA : వ్యవసాయం బాటలో గోల్డ్ మెడలిస్టులు - 'స్మార్ట్'గా సాగుతామంటూ ముందడుగు - HORTICULTURE SMART FARMING