Supreme Court Orders to Stop Illegal Sand Mining: ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వెంటనే మైనింగ్ జరిగే ప్రదేశానికి వెళ్లి ఆపాలని తెలిపింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి తగిన చర్యలు తీసుకోవాలని, అక్రమ మైనింగ్ జరుగుతున్న ప్రదేశాలను ఇప్పటికే గుర్తించినందున నిలిపివేశారా లేదా తనిఖీలు చేయాలని కేంద్రానికి ఆదేశం ఆదేశించింది.
అక్రమ మైనింగ్‌పై చర్యలు తీసుకున్నామన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. మీ చర్యలు అన్ని కాగితాలపైనే ఉన్నాయని, క్షేత్రస్థాయిలో కనిపించవు అని జస్టిస్ అభయ్ ఎస్ ఓఖా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అక్రమ మైనింగ్ వెంటనే ఆపాలని, అనుమతి ఉన్న చోట కూడా యంత్రాలను ఉపయోగించవద్దు అని గత నెల 29న సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాల తర్వాత కూడా అక్రమ మైనింగ్ చేపట్టారని ఎన్జీఓ నేత నాగేంద్ర కుమార్ పేర్కొన్నారు. తేదీ, సమయం, ఇసుక రవాణా చేస్తున్న వాహనాల ఫొటోలను సుప్రీంకోర్టు ముందు ఉంచారు.
దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం తవ్వకాల నిలిపివేతకు తీసుకున్న చర్యలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించింది. వచ్చే గురువారం నాటికి అఫిడవిట్ రూపంలో వివరాలు సమర్పించాలని తెలిపింది. నాగేంద్ర పేర్కొన్న ప్రదేశాల్లో తవ్వకాలు నిలిపేశాకే నివేదిక సమర్పించాలని పేర్కొంది. తదుపరి విచారణను వచ్చే గురువారం చేపట్టనున్నట్లు ప్రకటించింది.