Inter Student Died after Fell Down from Hostel Building : హైదరాబాద్ మాదాపూర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. చంద్రనాయక్ తండలోని నారాయణ ఐఐటీ క్యాంపస్‌లో కడప జిల్లా రైల్వే కోడూరుకు చెందిన విద్యార్థి శివకుమార్ రెడ్డి ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం రాత్రి క్యాంపస్ ఐదో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడి మృతి చెందినట్లు కాలేజీ యాజమాన్యం నిర్వాహకులు ఉపేందర్ రెడ్డి తెలిపారు.
మదాపూర్ సీఐ కృష్ణ మెహన్ తెలిపిన వివరాల ప్రకారం రాత్రి సమయంలో మృతుడు, మరికొందరు స్నేహితులతో బయటకు వెళ్లాలని భావించారు. విద్యార్థులు ఉంటున్న బిల్డింగ్ పక్కనే నిర్మాణంలో ఉన్న భవనం కోసం కట్టిన కర్రల సాయంతో వారు కిందకు దిగాలనుకున్నారు. కానీ శివకుమార్ రెడ్డి పట్టుతప్పి కింద పడిపోయాడు. ఇది గమమించిన స్నేహితులు వార్డెన్‌కు, ప్రిన్సిపల్‌కు సమాచారం అందించారు. వారు వచ్చి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించామని, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా దర్యాప్తు చేయనున్నట్లు మాదాపూర్ సీఐ కృష్ణ మెహన్ తెలిపారు. మృతుని బాబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
'కాలేజీ హాస్టల్ బిల్డింగ్‌లో ఐదో అంతస్తులో ఉన్న విద్యార్థులు రాత్రి 12 గంటలకు బయటకు వెళ్దామని అనుకున్నారు.శివకుమార్ రెడ్డి వారి స్నేహితులు బిల్డింగ్ పక్కన నిర్మాణంలో ఉన్న భవనం కోసం కట్టిన కర్రల సాయంతో కిందకు దిగుతామని అనుకున్నారు. కానీ ఆ క్రమంలో కర్రలు విరిగిశివకుమార్ రెడ్డికింద పడిపోయాడు. అది చూసి మిగతా విద్యార్థులు భయపడి అదే కిటికీలో నుంచి కిందకు దిగారు. వెంటనే మళ్లీ కిటికీ నుంచి బిల్డింగ్ లోపలకి వెళ్లి హాస్టల్ వార్డెన్‌కు,ప్రిన్సిపల్కుసమాచారం ఇచ్చారు'-కృష్ణ మెహన్, మాదాపూర్ సీఐ