Stubble Burning Issue In Telangana :రాష్ట్రంలో వరి, మొక్కజొన్న, పత్తి పంటలు కోసిన తర్వాత పంట వ్యర్థాలను రైతులు పొలాల్లోనే కాల్చడం వల్ల తీవ్ర వాయు కాలుష్యానికి దారితీస్తుంది. పంట అవశేషాల దహనం వల్ల వచ్చే అనర్థాలపై అన్నదాతలకు అవగాహన లేమి కారణంగా పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలోనే "వరి కొయ్యలు కాల్చడం - నష్ట నివారణ చర్యలు" అనే అంశంపై జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి తుమ్మల పాల్గొన్నారు. పంట వ్యర్థాలను కాల్చడం వల్ల భూమి కొంత కాలానికి నిస్సారంగా మారుతుందని తెలిపారు. ఈ విషయంపై రైతులకు అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు.
పంట వ్యర్థాల దహనం వల్ల వచ్చే నష్టాలేంటి? :
- పంట వ్యర్థాలు కాల్చడం వల్ల భూమిలో సేంద్రీయ కర్బనశాతం తగ్గుతుంది.
- ఈ విధంగా చేయడం వల్ల కొంత కాలనికి భూమి నిస్సారంగా మారుతుంది.
- వాయు కాలుష్యంతో శ్వాససంబంధిత వ్యాధులకు దారితీస్తుంది.
- ఇప్పటికే దిల్లీలాంటి రాష్ట్రాల్లో వాయుకాలుష్యంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు
- రైతుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.
- భూతాపం పెరిగి కుండపోత వానలు కురుస్తూ, ఆకస్మిక వరదలు, కరవు పరిస్థితులు తలెత్తుతున్నాయి.
- వాయు కాలుష్యం అనేది పెరుగుతుంది. వాతావరణంలో కార్బన ఉద్గారాలు పెరిగి ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి.
"వరి కొయ్యలు కాల్చడం - నష్ట నివారణ చర్యలు"పై పాలెం కృషివిజ్ఞాన కేంద్రం వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ టి.ప్రభాకర్ రెడ్డి దృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా రైతులకు అవగాహన కల్పించారు. అభ్యుదయ రైతులు చంద్రయ్య, దేవేందర్ రెడ్డి తమ అనుభవాలు పంచుకున్నారు. వరి కొయ్యలు కాల్చవద్దని, తద్వారా కలిగే లాభాలను తమ అభిప్రాయాలను తోటి రైతులతో పంచుకొన్నారు.