Telangana RTC JAC :తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యాజమాన్యానికి ఆర్టీసీ జేఏసీ సోమవారం (జనవరి 27న) సమ్మె నోటీసు ఇచ్చింది. జేఏసీ నేతలు ఆర్టీసీ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ మునిశేఖర్‌కు సమ్మె నోటీసును అందజేశారు. జేఏసీ నేతలు వస్తున్నారని తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యానికి సమాచారం రావడంతో బస్ భవన్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం 21 డిమాండ్లతో తమ సమ్మె నోటీసు ఇచ్చామని జేఏసీ నేతలు తెలిపారు. 15 రోజుల్లోపు యాజమాన్యం స్పందించకపోతే సమ్మె సైరన్ మోగిస్తామని జేఏసీ యూనియన్ నాయకులు స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు అవుతుందని ఆర్టీసీ సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు అందరిని కలిసాం. అయినా ఏఒక్కరూ పరిష్కారం దిశగా స్పందించలేదని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న పేర్కొన్నారు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మె నోటీసు ఇవ్వాల్సి వచ్చిందన్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటల సమయంలో ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని బస్ భవన్‌లో ఆపరేషన్ ఈడీ మునిశేఖర్‌కు సమ్మె నోటీసును అందజేశామని జేఏసీ చైర్మన్ తెలిపారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సెలవులపై ఉండటంతో ఈడీ మునిశేఖర్‌కు సమ్మె నోటీసు ఇచ్చినట్లు కార్మిక సంఘం నేతలు తెలిపారు. మొత్తం 21 డిమాండ్లతో సమ్మె నోటీస్ ఇచ్చామన్నారు.
"ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు అవుతుంది. ఆర్టీసీ సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి నుండి మంత్రుల వరకు అందరిని కలిశాం. అయినా మా సమస్యలను పరిష్కరించలేదు. గత ప్రభుత్వం విలీన ప్రక్రియను 90 శాతం పూర్తి చేసింది, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఎందుకు అమలు చేయడం లేదు? 2021 పీఆర్సీ ఇవ్వడంలేదు. 14 నెలలు సమయం ఇచ్చాం. ఇక మాకు ఓపిక లేదు. ఆర్టీసీని అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రైవేటు బస్సులు ఆర్టీసీలో ప్రవేశపెట్టి సంస్థ మనుగడకే ప్రమాదం కలిగేలా చేస్తున్నారు" -ఈదురు వెంకన్న, ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్
జేఏసీ నేతల ప్రధాన డిమాండ్లు : ప్రధానంగా మేనిఫేస్టోలో ఇచ్చిన హామీలను అమలుచేయాలని జేఏసీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, 2021 జీతభత్యాల సవరణ, కండక్టర్, డ్రైవర్ల ఉద్యోగ భధ్రత, ఎలక్ట్రిక్ బస్సులు ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీకి ఇవ్వాలని జేఏసీ కార్మిక నేతలు కోరారు. ఎలక్ట్రిక్ బస్సులను స్వాగతిస్తున్నామని, కానీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడాన్ని మాత్రమే తాము వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్థికపరమైన అంశాలను అమలుచేస్తూ, ప్రస్తుత సౌకర్యాలను కొనసాగిస్తూ ప్రభుత్వంలో విలీనం చేయాలన్నారు.
అన్ని కేటగిరిలలో ఖాళీలను భర్తీ చేయాలి : 2021 వేతన సవరణ అమలుచేస్తూ, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు అమలు చేయాలని అన్నారు. 2017 వేతన సవరణ బకాయిలను చెల్లించి, రిటైర్డ్ ఉద్యోగులకు వేతన సవరణ అమలుచేయాలని విజ్ఞప్తి చేశారు. కొత్త బస్సుల కొనుగోలు ద్వారా ఆర్టీసీని అభివృద్ధి పరిచి ఆధునీకరించాలన్నారు. బ్రెడ్ విన్నర్, మెడికల్ ఇన్ వాలిడేషన్ ఉద్యోగుల కుటుంబాలకు ఇచ్చే ఉద్యోగాలు రెగ్యులర్ ప్రాతిపదికన నియమించాలని డిమాండ్ చేశారు. అన్ని కేటగిరీలలో ఖాళీలను భర్తీచేయాలని, అర్హులకు పదోన్నతలు కల్పించాలని కోరారు.