Special Trains Delaying :గుడిలో రద్దీ అధికంగా ఉంటే దర్శనానికి స్పెషల్ టికెట్ తీసుకుంటాం. టికెట్ ధర కాస్త అధికమైనప్పటికీ దర్శనం తొందరగా అయిపోతుంది. పైగా దేవుడిని దగ్గరి నుంచి దర్శించుకోవచ్చు. హోటల్‌లోనూ ప్రత్యేక భోజనం, స్పెషల్ టీలకు ధర కొంత ఎక్కువైనప్పటికీ రుచికరంగా ఉంటాయి. ప్రత్యేక(స్పెషల్) రైళ్ల విషయంలో ద.మ.రైల్వే తీరు ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఇవి పేరుకే ‘స్పెషల్’. రైల్వేస్టేషన్‌లో ఏ ప్లాట్‌ఫాంపైకి వస్తాయో లాస్ట్ మినిట్ వరకు తెలియదు. రైలు వచ్చాక సంచులు మోసుకుంటూ పరుగెత్తుకుంటూ ప్లాట్‌ఫాంలు మారాలి. మార్గమధ్యంలో ఎన్నిసార్లు ఆగుతుందో ఆగినప్పుడు మళ్లీ ఎప్పుడు ట్రైన్ కదులుతుందో కూడా తెలియదు. అధిక ఛార్జీలు చెల్లించి మరీ ప్రయాణంలో ప్రత్యక్ష నరకం చూడాల్సిన పరిస్థితులు స్పెషల్ రైళ్లలో నెలకొన్నాయి.
100 కి.మీ దూరం వెళ్లేందుకు 6 గంటలు :రోడ్డుమార్గంలో 100 కి.మీ. దూరం వెళ్లేందుకు వాహనాల్లో దాదాపు గంటన్నర సమయం పడుతుంది. రైల్వే శాఖ నడిపించేటువంటి స్పెషల్ రైళ్లలో ఎంత సమయం పడుతుందో తెలుసా? అధిక ఛార్జీలను చెల్లించి టికెట్ కొన్న ప్రయాణికులు ఏకంగా 5-6 గంటల వరకు నిరీక్షించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. నల్గొండ నుంచి సికింద్రాబాద్‌కు దాదాపు 100 కి.మీ దూరం. కానీ, ప్రత్యేక రైల్లో 6.13 గంటలు నిరీక్షించాల్సిన పరిస్థితి. అదే పల్నాడు ఎక్స్‌ప్రెస్ 2.01 గంటల్లోనే గమ్యాన్ని చేరుతోంది.
పిల్లలు, వృద్ధులకు తప్పని తిప్పలు :దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ప్రధానరూట్లలో రైళ్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. ముఖ్యంగా సెలవు రోజుల్లో, పండగల సమయంలో అత్యధికంగా కనిపిస్తుంది. ఇలాంటి సమయాల్లో ప్రయాణికుల అవసరాలకు తగినట్లుగా రెగ్యులర్ రైళ్లను వేయాల్సిన అధికారులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. స్పెషల్ ట్రైన్లు అంటే పండగలు, వేసవి సెలవుల్లో ఉంటాయి. ద.మ.రైల్వే మాత్రం వివిధ రూట్లలో చాలా ఏళ్లుగా ‘స్పెషల్ పేరుతో రైళ్లను నడిపిస్తోంది. రెగ్యులర్‌గా మారిస్తే సాధారణ టికెట్ ఛార్జీలుంటాయి. ప్రత్యేక రైలుగా నడిపిస్తే అదనపు ఛార్జీల వసూలు చేసేందుకు వెసులుబాటు ఉంటుంది. ఈ ప్రత్యేక ట్రైన్ల ప్రయాణంలో అంతులేని జాప్యం అవుతుండటంతో పిల్లలు, వృద్ధులే ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు.