తెలంగాణ

telangana

ETV Bharat / state

టేస్టీగా ఉన్నాయని బయట దొరికే ఫుడ్​లు లాగించేస్తున్నారా? - అయితే ఈ విషయాలు తెలుసుకోవడం మస్ట్ - Story On Food Adulteration

Story On Food Adulteration : తిండి కలిగితే కండ కలదోయ్‌ అన్నారు మహాకవి గురజాడ అప్పారావు. అయితే, నాణ్యత ప్రమాణాలు లేని, కలుషిత ఆహారం ఎంత తీసుకున్నా తిప్పలు తప్పవు అంటున్నారు వైద్యులు. ఇది నూటికి నూరు శాతం వాస్తవమేనని తేలింది. మనిషి ఆరోగ్య సమస్యలకు మూలకారణం నాణ్యత లేని, కలుషిత ఆహారం తీసుకోవడమే అని ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా పలు ఆరోగ్య నివేదికలు ఇదివరకే వెల్లడించాయి. కలుషిత ఆహారం తీసుకోవడం వల్ల 10 మందిలో ఒకరు అనారోగ్యం బారిన పడుతున్నారు. 60 కోట్ల మంది మరణిస్తున్నారు. ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో బాధితులు పెరిగి, మరణాలు అధికం అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి, ఆహారం కలుషితం కాకుండా ఆపేదెలా? ఆహారం కలుషితం కావడానికి గల కారణాలు ఏంటి? కలుషిత ఆహారం తీసుకోకుండా ప్రజల్లో అవగాహన పెంచడం ఎలా? ఇప్పుడు చూద్దాం.

Story On Food Adulteration
Story On Food Adulteration (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 27, 2024, 5:23 PM IST

Story On Food Adulteration : వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియ్యాల వారి విందు వడ్డించు నాకే ముందు. ఈ పాట వింటే ఆహార ప్రియుల ఉవ్విళ్లూరిపోయేవారు. కారణం అప్పట్లో చేసే వంటకాలు రుచిగా, అమోఘంగా, సహజ సిద్ధంగా ఉండేవి. చంటి పిల్లవాడైతే పొద్దస్తమానం వంటింట్లోనే తిష్టవేసేవాడు. కొత్తరకం వంట చేస్తున్నారని తెలిస్తే చాలు వంటింటి గుమ్మం దగ్గరే కాపు కాసేవాళ్లు. మనసంతా వంటింటి వైపే ఉండేది.

ఇక పండుగలు పబ్బాలు వస్తే ఆహార ప్రియుల హడావుడి ఆపతరమా అన్నట్లు ఉండేది. ఎంత తిన్నా ఇంకా తినాలనిపించేది. కానీ, నేటి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఆహారం కలుషితం కావడం వల్ల కొంచెం తింటే చాలు పొట్ట ఉబ్బరంగా అనిపిస్తోంది. హోటళ్లు, రెస్టారెంట్లు, ఆన్‌లైన్‌ డెలివరీ సేవల కారణంగా వంటింటి ఊసే మరిచిపోయే దుస్థితి ఏర్పడింది. ఫలితంగా ఆహారం కలుషితమై అనారోగ్యం బారిన పడుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.

ఏటా 4.20లక్షల మరణాలు :కలుషిత ఆహారం తీసుకోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 4 లక్షల 20 వేల మరణాలు సంభవిస్తున్నాయి. 60 కోట్ల మంది రోగాల బారినపడి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా కలుషిత ఆహారం కారణంగా 70 శాతం మంది ఐదేళ్లలోపు చిన్నారులే చనిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కలుషిత, నాసిరకం ఆహారం, పోషకాహార లోపం కారణంగా అత్యధికంగా ఆరోగ్య సమస్యలు, వ్యాధులు తలెత్తుతున్నట్లు అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధనా సంస్థ తెలిపింది.

ఆహార కల్తీ రకాలు :4 రకాలుగా ఆహారం అనేది కలుషితం అవుతోందని ఆహార నిపుణులు చెబుతున్నారు. అవి

  • కెమికల్‌
  • ఫిజికల్‌
  • మైక్రోబయల్‌
  • అలెర్జినిక్‌
  1. కెమికల్ కంటామినేషన్ :ఆహార ఉత్పత్తి, ప్రాసెసింగ్‌, నిల్వ చేసే తరుణంలో రసాయనాలు వినియోగించడం వల్ల ఆహారం కలుషితం కావడాన్ని కెమికల్‌ కంటామినేషన్ అంటారు.
  2. Microbial Contamination :మైక్రోబయల్‌ కంటామినెషన్‌ అంటే బ్యాక్టీరియా, వైరస్‌ల కారణంగా జరుగుతుంది. ఇది సూక్ష్మజీవులకు అనుకూలమైన వాతావరణం, ప్రదేశాల్లో వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.
  3. ఫిజికల్​ కంటామినేషన్ :చిన్న పదార్థాల నుంచి పెద్ద వస్తువుల దాకా ఆహారం కలుషితం కావడాన్ని ఫిజికల్‌ కంటామినేషన్‌ అంటారు. అంటే గ్లాస్‌, ప్లాస్టిక్‌, చెత్త, వెంట్రులు తదితరాల వల్ల ఆహారం కలుషితం అవుతుంది.
  4. అలెర్జినిక్‌కంటామినేషన్ : కొన్ని సందర్భాల్లో ఆహారం కలుషితమైతే దాన్ని తీసుకున్న వెంటనే శరీరంపై దద్దుర్లు, దురద వంటివి ఏర్పడతాయి. దీనినే అలెర్జెనిక్‌ కంటామినేషన్ అంటారు. ఇలా నాలుగు రకాలుగా ఆహారం అనేది కలుషితమై మనిషి ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది.

200 రకాల వ్యాధులకు కారణభూతంగా :ఆహార కలుషితం కారణంగా విశ్వవ్యాప్తంగా బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం కలుషిత ఆహారం తీసుకోవడం వల్ల ఏటా 10 మందిలో ఒకరు అనారోగ్యం బారిన పడుతున్నారు. నాణ్యత ప్రమాణాలు సరిగ్గా పాటించని కారణంగా ఆహారం పాయిజన్‌గా మారి సుమారు 200 రకాల వ్యాధులకు కారణ భూతంగా మారుతోంది.

క్యాంపిలోబాక్టర్‌, సాల్మొనెల్లా, ఎస్చెరిచియా కోలి అనే బ్యాక్టీరియాల వల్ల ఆహారం ఎక్కువ శాతం పాయిజన్‌గా మారే అవకాశాలు ఉన్నాయి. వీటితో పాటు నోరో వైరస్‌, హైపటైటిస్‌-ఏ వంటి బ్యాక్టీరియాలు పిల్లలు, పెద్దల్లో అధికంగా ప్రభావం చూపుతున్నాయి. కొన్ని సార్లు వాటి తీవ్రత మరింత పెరిగి అసుపత్రులకు పరుగెత్తాల్సిన పరిస్థితి వస్తోంది. ముఖ్యంగా రోజుకి మూడు లేదా అంతకంటే ఎక్కువ సార్లు నీళ్ల విరేచనాలు, వాంతులు, తలనొప్పి, వికారం, కడుపు నొప్పి, తిమ్మిరి, జ్వరం వంటివి బాధితులను ఇబ్బందులకు గురిచేస్తాయి.

వర్షాకాలంలో ఫుడ్​ పాయిజిన్ అయ్యే అవకాశం :వర్షాకాలంలో ఎక్కువగా పుడ్ పాయిజన్‌ అయ్యేందుకు ఆస్కారం ఉంది. ఎందుకంటే చాలామంది వానకాలంలో మిర్చిబండి, పునుగుల కొట్ల దగ్గర వాలిపోతారు. వాతావరణం చల్లగా, పదార్థాలు వేడిగా ఉన్నాయని అతిగా లాగించేస్తారు. ఇక పానీ పూరి బండిని చూస్తే అమ్మాయిలు అస్సలు ఆగరు. ఎంత రుచిగా ఉందో అని లొట్టలేసుకుంటూ తింటారు.

కానీ, అందులో నాణ్యతా ప్రమాణాలు సరిగ్గా ఉన్నాయా? శుభ్రత పాటిస్తున్నారా? అని చూడకుండానే తినేస్తుంటారు. పట్టాణాల్లో జీవించే వారైతే హోటళ్లు, రెస్టారెంట్లకు బాగా అలవాటు పడ్డారు. ఆన్‌లైన్‌ డెలివరీ సేవలు అందుబాటులోకి రావడంతో చాలామంది ఆర్డర్లు పెట్టుకోవడానికి అలవాటు పడ్డారు. వారాతంపు సెలవులు వస్తే వంటగదిని మరచి స్విగ్గీ, జొమాటోలలో ఆర్డర్లు పెట్టుకుని తింటున్నారు. కొందరైతే ఆఫీసులకే ఆర్డర్‌ పెట్టుకుని తింటున్నారు. ఇలా బయటి ఆహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకోవడమే అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆహార ఉత్పత్తుల్లో క్యాన్సర్​ కారకాలు :దేశంలో సుమారు 527 రకాల ఆహార ఉత్పత్తుల్లో క్యాన్సర్‌ కారకమైన ఇథలీన్‌ ఆక్సైడ్‌ ఎక్కువగా ఉన్నట్లు యూరోపియన్‌ యూనియన్‌ ఫుడ్‌ సేఫ్టీ అధికారులు నివేదించారు. వీటిల్లో నిత్యం మనం వాడే పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు, సుగంధ ద్రవ్యాలు, గుడ్లు వంటి ఆహార పదార్థాలు ఉన్నాయి. సరిగ్గా ఉడకని మాంసం, సీఫుడ్‌లో ఉండే సాల్మోనెల్లా, కాంపీలో బ్యాక్టర్, ఈ-కొలీ వంటి బ్యాక్టీరియాలు జీర్ణాశయాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది.

ఆహార పదార్థాలను ఎక్కువ కాలం నిల్వ చేయడం వాటిపై బూజు ఏర్పడుతుంది. కొన్ని సార్లు చూసుకోకుండానే ఆ బూజు పట్టిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల ప్రాణం మీదకి వస్తోంది. అంతేకాదు, కాడ్మియం, సీసం వంటివి ఒంట్లో చేరితే కాలేయం, మూత్రపిండాలు వంటి అవయవాలతో పాటు రోగనిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది.

కలుషిత ఆహారం వల్ల అనర్థాలెన్నో : గత దశాబ్ద కాలంగా కలుషిత ఆహారం, నీటి వల్ల తలెత్తే రోగాలు పెరుగుతున్నట్లు పరిశీలనలు వెల్లడిస్తున్నాయి. వీటి మూలంగా దేశవ్యాప్తంగా ఏటా 10 కోట్ల మంది డయేరియా, టైఫాయిడ్, వాంతులు, కామెర్లు తదితరాల బారిన పడుతున్నారు. వీరిలో 90శాతానికి పైగా విద్యార్థులు, వర్కింగ్‌ హాస్టళ్లలో నివసిస్తున్నవారే ఉంటున్నారు.

ఆహార కల్తీకి అడ్డుకట్ట వేసేదెలా? :ఈ దుస్థితికి అడ్డుకట్ట పడాలంటే హాస్టళ్లు, హోటళ్లు ఇలా అన్నిచోట్లా నాణ్యమైన ఆహారం అందేలా ప్రభుత్వాలు పటిష్ఠ చర్యలు తీసుకోవాలి. వంటశాలల్లోకి కీటకాలు, ఎలుకలు చొరబడని విధంగా ఆటోమేటిక్‌ తలుపులు, మెష్‌లు ఏర్పాటు చేయించాలి. ఆహార వ్యర్థాల్ని ఎప్పటికప్పుడు తరలించేలా పర్యవేక్షించాలి. ప్రపంచ జనాభాలో 200 కోట్ల మందిని సూక్ష్మపోషకాల లోపం పీడిస్తోంది. 220 కోట్లమంది స్థూలకాయంతో బాధపడుతున్నారు.

అయిదేళ్లలోపు 14.8 కోట్ల మంది చిన్నారుల్లో ఎదుగుదల క్రమంగా మందగిస్తోంది. 4.8 కోట్ల మంది బాలలు ఉండాల్సిన దానికన్నా చాలా తక్కువ బరువున్నారు. ఈ గణాంకాలను పరిశీలిస్తే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే, మెరుగైన పోషకాహారం తీసుకోవడం వల్ల ఏటా 20 శాంత మరణాలను నివారించే అవకాశం ఉంది.

అధిక రసాయన ఎరువుల వినియోగంతో :ఆహార పదార్థాలు అనేవి ప్రాథమిక స్థాయిలోనే కలుషితం అవుతున్నాయి. ఎందుకంటే, చాలా మంది వ్యవసాయదారులు తక్కువ కాలంలో పంట చేతికి రావాలి. ఎక్కువ దిగుబడి సాధించాలని అధిక మోతాదులో రసాయనాలు వినియోగిస్తున్నారు. అక్కడే ఆహార కలుషితం కావడానికి బీజం పడుతోంది. ముఖ్యంగా కూరగాయల పంటల్లో రసాయన ఎరువుల వినియోగం విరివిగా పెరిగింది. తద్వారా వాటిలో పోషకాల స్థాయి తగ్గడమే కాకుండా హానికరంగా మారుతున్నాయి.అంతేకాకుండా వాటి రుచి సైతం మందగిస్తోంది.

వంట చేసేటప్పుడు రుచికోసం వివిధ రకాల పౌడర్లు, కలర్లు, నూనెలు అధికంగా వినియోగించాల్సి వస్తోంది. దీనివల్ల ఆహారం కలుషితమై తిన్నవారికి పుడ్‌ పాయిజన్‌ అవుతోంది. అయితే, సేంద్రియ వ్యవసాయంతో ఆహార కలుషితం తగ్గి, పోషకాల స్థాయి పెంచుకోవచ్చని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. అందుకు తగ్గట్లు ప్రభుత్వాలు రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అంటున్నారు. అధిక దిగుబడులు వచ్చేలా ప్రోత్సాహకాలు అందించాలని సూచిస్తున్నారు.

మానవ తప్పిదాలే :మనుషులు చేసే చిన్న తప్పిదాలే పెను ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నాయని నిపుణులు అంటున్నారు. తద్వారా ఆనారోగ్యానికి గురై ఆసుపత్రుల్లో చేరుతున్నట్లు చెబుతున్నారు. ఆహారం తీసుకోవడం నియంత్రణలో ఉంచుకోవడంతో పాటు పోషకాహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. అందుకోసం సకాలంలో పోషకాహారం, ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా ఆహారం తినేటప్పడు జాగ్రత్తలు తీసుకోవాలి.

ఘుమఘుమలాడుతున్నాయనో, కంటికి కలర్‌పుల్‌గా కనిపిస్తున్నాయనో బయటి ఆహారానికి అలవాటు పడితే ఆస్పత్రి ఖర్చులు అమాంతం పెరుగుతాయని గమనించాలి. బయట తినేటప్పుడే కాదు, ఇంట్లో వండుకునేటప్పుడూ సరైన నాణ్యతా ప్రమాణాలను పాటించాలి. కుళ్లిన కూరగాయలు, పాడైన గుడ్లను దూరం పెట్టాలి. ఫ్రిజ్‌లో పెట్టి తర్వాత వాడటాన్ని మానుకోవాలి. అప్పుడే మన ఆరోగ్యం మన చేజారిపోకుండా ఉంటుంది.

ఆహార కల్తీలో దేశంలోనే హైదరాబాద్ ఫస్ట్ - బయట తింటే ఖతమే - నమ్మలేని నిజాలివే!

Prathidwani : 'కల్తీ' కట్టడికి ప్రభుత్వం తీసుకోవాల్సిన తక్షణ చర్యలేంటి..?

ABOUT THE AUTHOR

...view details