Stormy Winds in Karimnagar District : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈదురు గాలులతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఎన్నికల వేడి పుంజుకున్న తరుణంలో భారీ ఈదురుగాలులు పార్టీలను కలవరపెడుతున్నాయి. మంథనిలో బీజేపీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ హాజరవుతుండగా, అన్ని ఏర్పాట్లు చేశారు. కొద్ది సేపట్లో ఆయన ప్రసంగిస్తారని భావిస్తున్న తరుణంలో భారీ ఈదురుగాలులతో టెంట్లు మొత్తం కూలిపోయాయి.
ఈదురు గాలుల ఎఫెక్ట్ - కాంగ్రెస్, బీజేపీ సభలు రద్దు :ఆ సమయంలో ప్రజలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అలానే కరీంనగర్ ఎస్‌ఆర్‌ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్న తరుణంలో అన్ని ఏర్పాట్లను ముమ్మరం చేశారు. భారీ ఈదురు గాలులు వీచి టెంట్లు నేలవాలాయి. కుర్చీలు చెల్లాచెదురయ్యాయి.
మరోపక్క కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మండలాల్లో భారీ ఈదురుగాలులు వీచాయి. ఆకాశం మేఘావృతమై ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. గత కొన్ని రోజులుగా ఎండవేడిమితో అల్లాడుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. వేములవాడ, జూలపల్లి గన్నేరువరంలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. కరీంనగర్‌తో పాటు హుజురాబాద్‌లో ఒక్కసారిగా ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి.