Deputy CM Bhatti Vikramarka Attend in GST Council Meeting : కేంద్ర ప్రాయోజిత పథకాల్లో షరతుల్లో రాష్ట్రాలకు కొన్ని వెసలుబాట్లు కల్పిస్తూ పునఃసమీక్షించాలని కేంద్రాన్ని కోరినట్లు ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. దిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ అధ్యక్షతన కేంద్ర బడ్జెట్ సన్నాహక సమావేశంతో పాటు, జీఎస్టీ కౌన్సిల్ భేటీలో భట్టి పాల్గొన్నారు.
బడ్జెట్ ప్రవేశపెట్టకముందే నికర రుణపరిమితి ప్రకటించాలి :ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం రాష్ట్రాలకు వాటా తగ్గిందని, కేంద్రప్రభుత్వం విధించే సర్ ఛార్జీలు, సెస్‌లను పదిశాతంలోపే ఉండేలా చూడాలని కోరినట్లు భట్టి తెలిపారు. అదేవిధంగా బడ్జెట్ ప్రవేశంపెట్టేందుకు నికర రుణపరిమితి ముందే ప్రకటించాలని కోరారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులతో పాటు పాలమూరు రంగారెడ్డికి జాతీయహోదా, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్కు నిధులివ్వాలని కోరినట్లు పేర్కొన్నారు. ఎరువులు, సమీకృత విద్యాలయాల భవనాలకు జీఎస్టీ తగ్గించాలని కోరినట్లు భట్టి పేర్కొన్నారు.
"కేంద్ర ప్రాయోజిత పథకాలపై పునఃసమీక్షించి, ఇప్పటివరకు ఉపయోగపడే కొన్ని కేంద్ర పథకాలపై పునఃసమీక్ష చేసి కొత్త పథకాలు తీసుకురావాలని కోరాం. ఆర్థిక సంఘాల సిఫారుసల ప్రకారం పన్ను విభజన విధానాల వల్ల రాష్ట్రాలకు ఆదాయం తగ్గింది. అందువల్ల కేంద్రం విధించుకునే సర్ ఛార్జీలు, సెస్‌లు వంటి వాటిని 10 శాతానికి మించకుండా ఉండేటట్టు చూడమని విజ్ఞప్తి చేశాను. అదేవిధంగా ఫెర్టిలైజర్స్ 18శాతం నుంచి 5శాతానికి తగ్గించాలని కోరాము." -భట్టి విక్రమార్క, ఉప ముఖ్యమంత్రి