SRSP Eco Tourism In Nizamabad:నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ పరివాహక ప్రాంతం పర్యాటకంగా త్వరలోనే అభివృద్ధి చెందనుంది. ఎస్సారెస్పీ వెనుక జలాల వద్ద ప్రకృతి అందాలు చూపరులను ఇట్టే ఆకట్టుకుంటాయి. ఇటీవలి కురిసిన భారీ వర్షాలకు శ్రీరాంసాగర్ జలకళను సంతరించుకుంది. గోదావరి వెనుక జలాల వద్ద ఇప్పటికే వందలాది జింకలు, నెమళ్లు, విదేశీ పక్షులు సందడి చేస్తున్నాయి. వేలాది ఎకరాల ముంపు భూముల్లో పచ్చదనం ఉట్టిపడుతోంది. ఈ అందాలను చూసేందుకు పర్యాటకులు తరలివస్తుంటారు.
ఎకో టూరిజం పాలసీతో అభివృద్ధి: నందిపేట్, డొంకేశ్వర్, ఆలూర్, ఆర్మూర్, బాల్కొండ మండలాలను కలుపుతూ గోదావరి పరివాహక ప్రాంతంలో పర్యాటక శోభ తేవాలని మూడున్నరేళ్ల క్రితమే రాష్ట్ర అటవీ పర్యాటక అభివృద్ధి సంస్థ సంకల్పించింది. రోడ్లు, పార్కింగ్ స్థలాలు, హోటళ్లు, కాటేజీలు నిర్మించాలని భావించింది. ఇందుకోసం 10 కోట్ల నిధులు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఐతే కార్యాచరణ పనుల్లో ముందడుగు పడలేదు. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ఎకో టూరిజం పాలసీని తీసుకొస్తామని ప్రకటించారు.
ఎస్సారెస్పీ పర్యాటక అభివృద్ధికి గతంలో ఇచ్చిన ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ప్రభుత్వానికి ఇటీవల లేఖ రాసింది. సర్కారు ఆమోదముద్ర వేస్తే సఫారీ, ట్రెక్కింగ్, బోటింగ్ సౌకర్యాలు కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు.