Srinivas Name Persons meets by Get Together in Karimnagar : శ్రీనివాస్ ఈ పేరు తెలుగునాట చాలా కుటుంబాల్లో వినిపిస్తోంది. ఈ పేరు ఉన్నవారంతా ఒకేచోట కలిస్తే ఎలా ఉంటుందో అనే ఊహానే భలేగా ఉందిగా కదా. మరి ఈ పేరున్నవారంతా ఒకే వేదికపై కలిసి, ఒకరితో ఒకరు భావాలు కలబోసుకునే ఆలోచన భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఉండే దైవజ్ఞ శ్రీనివాస్‌కు వచ్చింది. దీంతో వెంటనే 'మనమంతా శ్రీనివాసులమే' అని వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేశారు. అందులో శ్రీనివాస్ పేరు ఉన్న వందల మంది చేరారు. వీరంతా తమ వృత్తి వ్యాపార విషయాలను, సాధకబాధకాలను పంచుకుంటారు. అందరు ఒకటై ఆపదలో ఉన్న స్నేహితులను సైతం ఆదుకుంటారు.
ఇటీవల నుంచి పిల్లలు శ్రీనివాస్ అని పేరు పెట్టుకునే వారు తగ్గుతున్నారని వారంతా గ్రూప్‌లో చర్చించారు. ఈ మేరకు తమ పేరు విశిష్టతను చాటిచెప్పేలా ఒక కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ఆలోచనకు కరీంనగర్‌కు చెందిన వూట్కూరి శ్రీనివాస్‌రెడ్డి రూపాన్నిచ్చారు. 'కరీంనగర్ శ్రీనివాసులం' అనే స్పెషల్ వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసి తమ జిల్లాకు చెందిన శ్రీనివాసులందరూ ఒకటయ్యారు. అలా కరీంనగర్ విద్యానగర్‌లోని వేంకటేశ్వర స్వామి ఆలయానికి శనివారం శ్రీనివాస్ అని పేరు ఉన్న 150 మంది వరకు చేరుకుని సందడి చేశారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలికరిస్తూ పరిచయం చేసుకున్నారు.