Sri Paidithalli Sirimanotsavam Ankurarpana Program:ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం శ్రీ పైడితల్లి సిరిమానోత్సవంలో కీలక ఘట్టానికి అంకురార్పణ జరిగింది. అమ్మవారి సిరిమానును తీసుకొచ్చే ప్రక్రియను ఆలయ అధికారులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా డెంకాడ మండలం పెదతాడివాడలోని అప్పారావు, సూర్యనారాయణ కల్లంలో గుర్తించిన (చింతచెట్టు) సిరిమానుకు ఆలయ సంప్రదాయాల ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అటవీ అధికారుల సహాయంతో సిరిమాను, ఇరుసుమాను తొలగించే ప్రక్రియను ప్రారంభించారు.
సిరిమాను తొలగింపు ప్రత్యేక పూజాది కార్యక్రమాల్లో దేవాదాయశాఖ అధికారులు, పైడితల్లి ఆలయ పండితులతో పాటు, విజయనగరం, నెల్లిమర్ల ఎమ్మెల్యేలు లోకం మాధవి, అదితి విజయలక్ష్మి గజపతిరాజు, మార్క్ ఫెడ్ ఛైర్మన్ కర్రోతు బంగార్రాజుతో పాటు పెద్దఎత్తున సమీప గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. అతంత్య భక్తిశ్రద్ధలతో గుర్తించిన సిరిమానుకు పూజలు చేశారు. అనంతరం సిరిమాను చెట్టును భూదేవి నుంచి వేరుచేసే క్రతువుకు శ్రీకారం చుట్టారు. సిరిమాను కోత, తరలింపు కార్యక్రమానికి పలు ప్రాంతాల నుంచి పెద్దఎత్తున భక్తులు తరలిరావటంతో పెదతాడివాడలో సందడి నెలకొంది. భక్తులు పైడితల్లి అమ్మవారికి మొక్కులు చెల్లించకున్నారు.