NTR 101 Birth Anniversary :'వొడ్ల కుప్పని అట్టాగ ఎంతసేపు సూత్తవ్. నువ్వు సూత్తే వొడ్లు ఏమన్నా పెరుగుతయా ఏంది? దేవుడు ఎన్ని పండాలని రాసి పెడితే అన్నే పండుతాయి గదా' అని మా అమ్మ, నాయనమ్మ, తాతయ్య అప్పటికి ఐదోసారో ఆరోసారో మా నాన్నతో అనడం. నాన్న మాత్రం గుండె పగిలిన మనిషిలా ఆ వడ్లని అలా చూస్తూనే ఉన్నాడు.
నాన్న బాధకు బలమైన కారణం లేకపోలేదు. ప్రతి ఏడాదీ చేలో కల్లం కొట్టి వడ్లను ఎద్దుల బండ్లపై జల్లల్లో పోసుకుని ఇంటికి చేర్చి ఆరు బయట పట్టలపై పోసి నాలుగైదు రోజులు ఎండకు ఆరబెట్టి, కుప్పగా చేసినప్పుడు చూడాలి. నాన్న ముఖం దీపాల పండగ నాటి మతాబులా వెలిగిపోయేది. ఇంటిల్లిపాదీ పడిన కష్టానికి తగ్గట్లుగా వడ్లు పండాయని సంబరపడేవాడు. పనోళ్లకు అడిగిన దానికంటే రెండు మూడు మానికలు ఎక్కువ వడ్లు ఇచ్చేవాడు. (మానిక అంటే కొలిచే పాత్ర. అప్పట్లో ఒక బస్తా అంటే కొలతకు 54 మానికలు తూకానికి 76 కిలోలు). ఆ ఏడాది పంటకు తెగుళ్లు సోకి చేను చాలా తక్కువ పండింది. అందుకని నాన్న కుశాలగా లేడు. పెట్టిన పెట్టుబడి పోను మిగిలిన గింజలు ఏడాదంతా తిండికి సరిపోతాయా అని బాధపడుతున్నాడు.
ఆ రోజు వడ్లను గోతాల్లోకి ఎత్తబోతుండగా ఎలుకల బుట్టల ఎల్లన్న వచ్చాడు. చేలో వరి దుబ్బుల్ని ఎలుకలు కొట్టకుండా, గట్ల దగ్గర బుట్టలు పెట్టి, వాటిని పట్టి, పంటను కాపాడాడాయన. అందుకు వడ్లు ఇస్తామని నాన్న వాళ్లు ఒప్పుకొన్నారు. ఆ రోజుల్లో డబ్బులు చాలా తక్కువ ఉండేవి. ప్రతి పనికీ వడ్లనే ఇచ్చేవారు. ఎల్లన్న గోతం తెరిచి పట్టుకుంటే నాన్న మానికతో వడ్లను పోస్తున్నాడు. అలా ఎనిమిది మానికలు కొలిచి ఆపేశాడు. 'అదేంది ఎంగటేసర్లు గోరూ పది మానికలు కదా అనుకుంది.
ఎనిమిదే పోశారేంది?' అని ఎల్లన్న అడిగాడు. 'ఈసారి పెద్దగా పండలేదు లేరా ముందటేడుకు ఎక్కువ కొలుత్తాలే' అని నాన్న చెప్పాడు. 'ముందనుకున్నట్టు కొలవాల్సిందే మీలాగే మిగతా వాళ్లూ తగ్గిత్తే నా పొట్ట గడిచేదెట్టా' అని ఎల్లన్న దీనంగా అన్నాడు. 'పనోళ్లకు తగ్గించి మిగిలిచ్చిన వొడ్లు తిన్నా మనకు వొంటబట్టవు లేరా. వాడికి మొత్తం కొలిచి ఇచ్చెయ్యి' అని తాతయ్య అనడంతో నాన్న అయిష్టంగానే మిగతా రెండు మానికల వడ్లనూ గోతంలో పోశాడు.
ఎన్టీఆర్ 101వ జయంతి : కాలువ నీటిని చేనికి రెండు తడులు ఎక్కువ పెట్టుకోనిచ్చిన లస్కరు సుబ్బయ్య, ఏడాదంతా క్షవరాలు, గడ్డాలు చేసిన నారాయణ, బట్టలు ఉతికిన గోవిందు, ఇంట్లో చిన్నోళ్లకు, పెద్దోళ్లకు చెప్పులు కుట్టిన యాకోబు, శుభకార్యాలకు అవసరమైన కుండలు ఇచ్చిన మల్లన్న, బర్రెలు దున్నల్ని మేపిన దావీదు, కర్రకు ముల్లు పెట్టడం నుంచి నాగలి చేయడం వరకూ చక్కబెట్టిన సూర్యనారాయణ ఇలా అందరూ గోతాలు తీసుకుని ఒకరి తర్వాత ఒకరు వచ్చారు. ఎలాంటి తగ్గింపులూ లేకుండా వాళ్లకు నాన్న వడ్లు కొలిచాడు. జ్వరాలూ, రోగాలూ, రొష్టులూ వస్తే ఇంటికొచ్చి చూసి, బిళ్లలు రాసిచ్చి మా ఆరోగ్యాన్ని కాపాడిన ఆర్ఎంపీ డాక్టరు గారు పంపిన మనిషి చివర్లో వచ్చాడు. అందరికంటే ఎక్కువగా ఆయనకు 25 మానికల వడ్లు ఇచ్చి పంపాడు నాన్న.
మిగిలిన ధాన్యాన్ని గోతాల్లోకి ఎత్తి, మూతులను కుట్టి ఆ బస్తాల్ని ఇంటి పంచలోకి చేరుస్తుండగా చాటింపు కోటన్న తప్పెట శబ్దం మాకు దగ్గరవుతూ వస్తోంది. 'ఇందుమూలంగా అందరికీ జెప్పేదేందంటే ఎంటీ రామారావు గోరు తెలుగుదేశం పారిటీ బెట్టారంట. మనూరోల్లం గూడా ఆ పారిటీలో జేరాలని, పారిటీ జెండా కోసం నాలుగడుగుల ఎత్తున దిమ్మెను కట్టాలని, జెండా కట్టడానికి 40 అడుగుల పేద్ద ఇనప కడ్డీని కొనాలని పెద్దోల్లంతా అనుకుంటున్నారు. పారిటీ మీటింగులకు పోవడానికి డబ్బులు పోగుచేసుకోవాలంట. అందుకని ఎవురికి తోచినంత వారు డబ్బులుగానీ వొడ్లుగానీ ఇయ్యాలంట. ఈ రోజు మాపటేల ఇద్దరు మడుసులు ఈ బజారుకొచ్చి వసూలు జేత్తారహో' అని కోటన్న గుక్క తిప్పుకోకుండా చాటింపేసి మళ్లీ తప్పెట వాయించుకుంటూ ముందుకు వెళ్లిపోయాడు.
ఎన్టీఆర్ ఈ పేరు వింటేనే ఏదో కొత్త బలం వచ్చినట్లు కనిపించేవాడు నాన్న. ఎప్పుడన్నా పేటకో, గుంటూరుకో పోయినప్పుడు హాల్లో ఎంతో కుశాలగా సినిమాలు చూసేవాడు. పండక్కో పబ్బానికో ఊళ్లో బొడ్డురాయి కాడో, పంచాయతీ ఆఫీసు దగ్గరో తెర కట్టి ప్రొజెక్టర్ పెట్టి వేసే ఎన్టీఆర్ సినిమాల్ని చూసేటప్పడు చాలా ముందుగానే వెళ్లి ముందు వరుసలో కూర్చునేవాడు.